పురిటి నొప్పులతో గర్భిణీ...గేమ్స్ ఆడుకుంటున్న డాక్టర్లు

పురిటి నొప్పులతో గర్భిణీ...గేమ్స్ ఆడుకుంటున్న డాక్టర్లు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్న తెలంగాణ సర్కార్...కనీస వైద్యం కూడా అందించడం లేదని మరోసారి నిరూపితమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి వైద్యం చేయాల్సిన డాక్టర్లు స్టార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రస్తుతం పసికందు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 

 

గర్బిణీ పట్ల నిర్లక్ష్యం..

మెదక్ జిల్లా తూప్రాన్ 50 పడకల ప్రభుత్వ దవాఖానాలో దారుణం జరిగింది.  యావపూర్ గ్రామం నుండి తూప్రాన్ 50 పడకల ఆస్పత్రికి పురిటి నొప్పులతో  వచ్చిన పిట్ల వనజ అనే గర్బిణీ పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ వైపు ప్రసవ వేదనతో వనజ బాధపడుతుంటే..డాక్టర్లు మాత్రం ఎంచక్కా సెల ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. తన భార్యకు నొప్పులు వస్తున్నాయి...పరిస్థితి సీరియస్గా ఉందని..వనజ భర్త పలుమార్లు డాక్టర్లకు చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తిట్లు వ్యవహరించారు. ఫలితంగా వనజ స్ట్రెచర్ పైనే డెలివరీ అయింది.

శిశువుకు సీరియస్..

వనజ స్ట్రెచర్ పైనే డెలివరీ  అయినా కూడా డాక్టర్లు స్పందించలేదు. డాక్టర్ల నిర్లక్ష్యంతో...బేబీ ఉమ్మ నీరు మ్రింగింది. దీంతో పసికందు పరిస్థితి   విషమించింది. దీంతో  మే 6వ తేదీన అర్దరాత్రి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  శిశువు పరిస్థితి విషమంగా  ఉందని తండ్రి తెలిపాడు. 


తప్పు చేసి దబాయింపు..

నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు పరిస్థితి విషమించడానికి కారణం అయిన తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు..తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితులపై దబాయింపులకు దిగారు. డెలివరీకి ఇంకా 15 రోజుల సమయం ఉందని.. అప్పుడే ఎలా పురిటినొప్పులు వస్తాయంటూ డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు శిశువు తండ్రి తెలిపాడు. తన భార్యకు  స్ట్రెచర్ పై ప్రసవం జరిగిందని..కాళ్లు మొక్కుతాం త్వరగా వచ్చి వైద్యం చేయండని విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 


ఆస్పత్రి ఎదుట ధర్నా

ఈ ఘటనపై వనజ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసికందు పరిస్థితి విషమంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై సూపరిండెంట్ అమర్ సింగ్ ను వివరణ కోరగా అలాంటిదేమి జరగలేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం .