అటకెక్కిన నకిలీ చలాన్ల కుంభకోణం

అటకెక్కిన నకిలీ చలాన్ల కుంభకోణం
  • అటకెక్కిన నకిలీ చలాన్ల కుంభకోణం
  • నాలుగేళ్లుగా దోషులపై చర్యల్లేవ్‌‌
  • ఖజానాకు జమకాని రూ.190 కోట్లు
  • పాలకుల మౌనం  వెనుక మర్మమేంటీ..? 


నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం రేపిన కమర్షియల్ టాక్స్ నకిలీ చలాన్ స్కామ్ దోషులపై చర్యలు చేపట్టడంలో సర్కార్​ నిర్లక్ష్యం చేస్తోంది. దోషుల నుంచి రూ.260 కోట్లు రికవరీ చేయాలని నిర్ణయించి రూ.70 కోట్లు వసూలు చేశారు. మిగతా రూ.190 కోట్లు రికవరీపై పాలకులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఆకాశరామన్న లేఖతో  వెలుగులోకి..

2017లో ఆకాశరామన్న పేరుతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులకు చేరిన లేఖతో కమర్షియల్ టాక్స్ స్కామ్ డొంక కదలింది. నకిలీ చలాన్లతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మను ఎగవేసి రైస్ మిల్లరు, వ్యాపారులు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారు. మొదట రూ.500 కోట్ల  ప్రభుత్వ ఆదాయాన్ని కాజేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎఫ్‌‌సీఐకి  సరఫరా చేసే బియ్యానికి సంబంధించిన బిల్లుల మొత్తానికి 5 శాతం సొమ్మును పన్ను కింద ఖజానాకు జమ అవుతుంది. 2013 వరకు డీలర్లే వాణిజ్య పన్నుల శాఖకు జమ చేసే వారు. అనంతరం టీడీఎస్ అమల్లోకి రావడంతో ఎఫ్‌‌సీఐ నేరుగా వాణిజ్య పన్నుల శాఖ ఖతాకు మళ్లిస్తోంది. అయితే 2013 వరకు డీలర్లు చలాన్ల రూపంలో నామమాత్రం రుసుంను చెల్లించి వాణిజ్య పన్నుల శాఖకు నకిలీ చలాన్లు దాఖలు చేశారు. అలా వందల కోట్లను లూటీ చేశారు. 

సీబీసీఐడీతో విచారణ..

ఈ నకిలీ చలాన్ల కుంభకోణం బట్టబయలు కావడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.  ఇందులో కమర్షియల్ ఉన్నతాధికారులతో పాటు రైస్‌‌ మిల్లర్లు, వ్యాపారులు ఈ స్కామ్‌‌లో ఇన్వాల్ కావడంతో విజిలెన్స్, సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. వారు మూడు నెలల సుదీర్ఘ విచారణ జరిపారు. 2009 నుంచి 2014 వరకు బోధన్ వాణిజ్య పన్నుల శాఖ సర్కిల్‌‌లో పనిచేసిన అధికారుల కనుసన్నల్లో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన గ్రైనెట్, రైస్ మిల్లర్లు తమ శాఖలను ఏర్పాటు చేసి పన్నులకు సంబంధించిన నకిలీ చలాన్లతో స్కామ్ చేసినట్లు నిర్ధారించారు.  దీంతో కొందరు అధికారులను సస్పెండ్‌‌ చేయడంతో పాటు కీలకపాత్ర నిర్వర్తించిన వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ స్కామ్ లో  కీలక సూత్రధారిగా భావించిన ఇన్‌‌కంట్యాక్స్ సీఏ శివరాజ్‌‌ను కూడా విచారణ జరిపి అరెస్ట్ చేశారు.

150 మందికి నోటీసులు..

 సమగ్ర విచారణ జరిపిన ఆఫీసర్లు రూ.500 కోట్లు స్కామ్ కాదని రూ.260 కోట్ల మాత్రమేనని నివేదిక ఇచ్చారు. అయితే స్కామ్ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కామ్‌‌లో బాధ్యులుగా చేసిన మొత్తం 150 మందికి నోటీసులు జారీ చేశారు. కాజేసిన సొమ్మను వాపసు చేయాలని లేనిపక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని  ప్రభుత్వం పేర్కొంది. దీంతో కొంత మంది వ్యాపారులు రైస్ మిల్లర్లు తమ రెప్యూటేషన్ దెబ్బతింటుందని కొంత మేరకు చెల్లించారు. ఇప్పటి వరకు రూ.70 కోట్లు వరకు రికవరీ చేసారు. ఇంకా రూ. 190 కోట్లు రికవరీ బాకీ ఉంది. ఈ స్కామ్  జరిగి నాలుగున్నరేళ్లు కావస్తోంది. 

సర్కార్ తీరుపై అనుమానాలు

కమర్షియల్ ట్యాక్స్ నకిలీ చలాన్ల స్కామ్ కేసులో కాజేసిన సొమ్ము రికవరీని ప్రభుత్వం కావాలనే పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న సదరు వ్యక్తులు తమ ఫారమ్ల పేరిట చెక్కులను కమర్షియల్ ట్యాక్స్ శాఖకు సమర్పించారు. పోస్ట్ డేట్ న్న చెక్‌‌లను బ్యాంక్‌‌లో వేస్తే ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. కానీ ఈ చెక్కుల వ్యవహారం బయటకు రాలేదు. చెక్కులు ఉన్నందున వారే చెల్లిస్తారని అధికారులు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు స్టేట్ సేల్స్ ట్యాక్స్‌‌ జీఏస్టీ పరిధిలోకి తీసుకరావడంతో కూడా స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి.  

దోషులపై చర్యలేవి...

రూ.260 కోట్ల స్కామ్‌‌ జరిగి నాలుగున్నరేళ్లు అవుతోంది. ప్రభుత్వం దోషులను ఎందుకు వదిలేస్తోంది. రైస్ మిల్లర్ల సంఘం నాయకులు టీఆర్ఎస్‌‌లో చేరారనే వదిలేస్తున్నారా ఏందీ. 
– బస్వా లక్ష్మీనర్సయ్య, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​  

దోషులకు ఆధికార పార్టీ అండ

నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఈ బండాకం బయటపడి నాలుగున్నరేండ్లు కావస్తున్నా రికవరీలో జాప్యం చేస్తున్రు. దోషులకు అధికార పార్టీ అండ ఉన్నట్లు తెలుస్తోంది. 
– మోహన్‌‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్​ ​