
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళపై దౌర్జన్యం కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి, కోటంరెడ్డి దాడి చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేల్చారు. ఆపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం అర్ధరాత్రి దీక్ష చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడి వద్ద ఓ ప్రైవేటు లేఅవుట్‌కు సంబంధించి పంచాయతీ పైపులైను కనెక్షన్ కావాలని తనకు దరఖాస్తు చేసుకున్నారని.. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలు, నియామకాల్లో తీరిక లేకుండా ఉండటంతో పరిశీలించడం ఆలస్యమవడంతో ఎమ్మెల్యే తనను బెదిరించారని ఎంపీడీవో పీఎస్ లో ఫిర్యాదు చేశారు. నెల ఒకటో తేదీన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌లో బెదిరించారని, శుక్రవారం రాత్రి కల్లూరుపల్లిలోని తన నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను బెదిరించారని ఎంపీడీవో ఎమ్మెల్యేపై కేసు పెట్టారు.
ఈ కేసు విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్, చట్టం ముందు అందరూ సమానమేనని, అనుచితంగా ప్రవర్తించే వారు ఎవరైనా ఉపేక్షించ వద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు స్పష్టం చేయడంతో ఆపై కోటంరెడ్డి అరెస్ట్ కు పోలీసులు కదిలినట్టు తెలుస్తోంది.