
రెండు విమానాలు ఢీకొట్టుకోబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఈ ఘటన నేపాల్‌లో జరిగింది.
ఏం జరిగింది..
నేపాల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎయిర్‌బస్ A-320 కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తోంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వెళ్తోంది. అయితే ఈ రెండు విమానాలు అతి దగ్గరగా వచ్చాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు దిగుతోంది. నేపాల్ ఎయిర్ లైన్స్ కూడా అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో వెళ్తోంది. అయితే దీనిపై రాడార్ సంకేతాలు ఇవ్వడంతో రెండు విమానాల పైలట్లు అప్రమత్తమయ్యారు. నేపాల్ విమానం వెంటనే 7 వేల అడుగులకు దిగడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై దర్యాప్తునకు నేపాల్ పౌర విమానయాన సంస్థ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఘటనా సమయంలో కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జులుగా ఉన్న ముగ్గురు అధికారులపై సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ సస్పెన్షన్ వేటు వేసింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై చర్య తీసుకున్నట్టు తెలిపింది.