Dipendra Singh Airee: 6 బంతుల్లో 6 సిక్స్‌లు.. చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్

Dipendra Singh Airee: 6 బంతుల్లో 6 సిక్స్‌లు.. చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్

నేపాల్ యువ హిట్టర్ దీపేంద్ర సింగ్ ఐరీ మరోసారి రెచ్చిపోయాడు. గతేడాది టీ20ల్లో అత్యంత వేగవంతమైన(9 బంతుల్లో) హాఫ్ సెంచరీ బాదిన ఇతగాడు.. ఈసారి అంతకుమించిన ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదాడు. దీంతో ఈ ఘనత సాధించిన మూడో ఆట‌గాడిగా చరిత్ర సృష్టించాడు. 

ఏసీసీ ప్రీమియర్ కప్‍లో భాగంగా నేడు(ఏప్రిల్ 13) ఖతార్, నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‍లో దీపేంద్ర సింగ్ ఐరీ.. ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టాడు. ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఈ ఫీట్ సాధించాడు. మొదటి బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదిన ఐరీ.. రెండో బంతిని పాయింట్ మీదుగా సిక్స్‌గా మలిచాడు. మూడో బంతిని మిడ్ వికెట్ మీదుగా, నాలుగో బంతిని   హెలికాప్టర్ షాట్‍తో బౌండరీ లైన్ దాటించాడు. చివరి రెండు బంతులను లెగ్ సైడ్ వైపు సిక్స్‌లుగా మలిచాడు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

యువీ, పొలార్డ్.. 

ఐరీ కంటే ముందు టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్, వెస్టిండీస్ విధ్వసంక క్రికెట‌ర్ కీర‌న్ పోలార్డ్‌లు టీ20ల్లో ఈ ఘ‌న‌త సాధించారు. 2007 టీ20 ప్రపంచకప్‍లో ఇంగ్లండ్‍తో జరిగిన మ్యాచ్‍లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‍లో యువీ ఈ ఘ‌న‌త సాధించాడు. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20లో పొలార్డ్.. అఖిల ధనంజయ బౌలింగ్‍లో ఆరు భారీ సిక్స్‌లు బాదాడు.