
నేపాల్ లో నాలుగు రోజులుక్రితం చెలరేగిన అల్లర్లు భారీ విధ్వంసం సృష్టించాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 25 జైళ్లు కూడా ధ్వంసం చేశారు. దాదాపు 15వేల మంది ఖైదీలు పారిపోయారు. భద్రతాదళాలతో జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది ఖైదీలు మృతిచెందారు. మరోవైపు భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన 35 మంది పారిపోయిన నేపాల్ ఖైదీలను సరిహద్దుల్లో సశస్త్ర సీమా బల్ (SSB) అరెస్టు చేసింది.వీరిలో ఉత్తరప్రదేశ్‌లోని సరిహద్దులో 22 మంది, బీహార్‌లో 10 మంది ,బెంగాల్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఖాట్మండు, పోఖారా,లలిత్‌పూర్ ,నఖు, మాధేష్ ప్రావిన్స్ లోని రామెచాప్, ధాంగ్, చిత్వాన్, నవాల్పూర్, సుంసారి, కాంచన్ పూర్, ఖైలాలీ, జలేష్ పూర్, కస్కీ, జుమ్లా, సోలుకుంభ్, గౌర్, బఝంగ్, డిల్లీ బజార్ జైళ్లనుంచి మొత్తం 15వేల మందికిపైగానే ఖైదీలు పరారయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు.
ఖాట్మండు, పోఖారా,లలిత్‌పూర్ జైళ్ల నుంచి వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు. పోఖారా జైలులో నిరసనకారులు 900 మంది ఖైదీలను విడుదల చేశారు. మహోతారి జిల్లాలో విధ్వంసకారులు జలేశ్వర్ జైలుకు నిప్పు పెట్టారు. 576 మంది ఖైదీలలో ఒకరు తప్ప మిగిలిన వారందరూ తప్పించుకుకున్నారు.
ఖాట్మండులోని నఖు జైలులో మాజీ హోంమంత్రి రవి లచిమనే మద్దతుదారులు ఆయనను విడిపించేందుకు జైలు గేట్లను పగలగొట్టారు. ఈ సందర్భంలో మిగిలిన ఖైదీలు కూడా పారిపోయారని తెలుస్తోంది.
మాధేష్ ప్రావిన్స్‌లోని రామెచాప్ జిల్లా జైలులో గురువారం భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మృతిచెందారు. 13 మంది గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేల్చి ఖైదీలు జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. భద్రతాదళాలు జరిపిన దాడుల్లో ముగ్గురు ఖైదీలు మృతిచెందారని పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 9న జరిగిన జనరేషన్ జెడ్ నిరసనల క్రమంలో ఝపా జైలునుంచి 92 మంది ఖైదీలు తప్పించుకున్నారు. అనర్మణీ జైలునుంచి 36మంది, డమాక్ జైలునుంచి 51 , జిల్మిల్ నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. పరారీలో ఖైదీలకుకోసం గాలిస్తున్నారు. జిల్లాలోని డమాక్, బిర్తమోడ్, జిల్మిల్,కాకద్భిట్టాలలోని పోలీసు స్టేషన్లకు నిరసనకారులు నిప్పంటించి ధ్వంసం చేశారు.