పిల్లలన్న కనికరం లేకుండా చావబాదారు: నేపాల్ బౌలర్లను చితక్కొట్టిన పాక్

పిల్లలన్న కనికరం లేకుండా చావబాదారు: నేపాల్ బౌలర్లను చితక్కొట్టిన పాక్

ఆసియా క‌ప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మొదట్లో కాస్త కష్టబడినా.. చివరలో ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం (151) పరుగులు చేయగా, ఇఫ్తికర్ అహ్మద్(109) శతకం బాదాడు. వీరిద్దరి ధాటికి పాక్.. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు మంచి ఆరంభం లేదు. ఫఖర్ జమాన్(14) పరుగులకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్(5) రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 25 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పాక్ కెప్టెన్ బాబర్.. ఎప్పటిలానే జోరు కొనసాగించాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 151 పరుగులు చేశాడు. అతనికి ఇఫ్తికర్ అహ్మద్(109; 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు).. మరో ఎండ్ నుంచి మంచి సహకారం అందించాడు.

నేపాల్ బౌలర్లలో సొంపాల్ కమీ 2 వికెట్లు తీసుకోగా.. కరణ్, సందీప్ లామిచానే చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో నేపాల్ విజయం సాధించాలంటే.. 343 పరుగులు చేయాలి.