ర్యాపర్ టు ప్రైమ్ మినిస్టర్.. 35 ఏళ్లకే ప్రధాని పీఠం.. ఏంటి బాలేంద్ర షా స్పెషల్..?

ర్యాపర్ టు ప్రైమ్ మినిస్టర్.. 35 ఏళ్లకే ప్రధాని పీఠం..  ఏంటి బాలేంద్ర షా స్పెషల్..?

నేపాల్ లో సరికొత్త చరిత్ర మొదలైంది. రాజకీయాలకు సంబంధం లేకుండా.. పాటలు పాడుకుంటూ.. యూత్ ను ఉర్రూతలూగిస్తూ సరదాగా గడిపే వ్యక్తి ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. కాకలు తీరిన మహామహులకు సాధ్యం కానిది ఒక ర్యాపర్ చేశాడు. 35 ఏళ్ల వయసులో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తానని బహుషా అతడు కూడా ఊహించి ఉండడు. 2026 మార్చి 27న వేద మంత్రాల నడుమ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి.. నేపాల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్తుడైన ప్రధానిగా బాలేంద్ర షా చరిత్ర సృష్టించాడు. 

నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) పార్లమెంటరీ లీడర్ గా ఎన్నకైన  తర్వాత.. బాలేంద్ర షాతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి  రామచంద్ర పౌదెల్. రాష్ట్రపతి భవన్ శీతల్ నివాస్ లో.. వేద మంత్రాల మధ్య ప్రమాణ స్వీకారం జరిగింది. బాలేంద్ర షా అనే నేను.. అనే సరికి రాష్ట్రపతి భవన్ కరతాళ ధ్వనులతో మార్గోగిపోయింది. 

శంకనాదాలు, వేద మంత్రాలు:

వేద మంత్రాల మధ్య బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం జరిగింది.  శంఖనాదం (శంఖాలను పూరించడం), 108 మంది పూజారుల చేత స్వస్తిశాంతి పఠనాలు , 16 మంది బౌద్ధ సన్యాసులచే అష్టమంగళ మంత్రోచ్ఛారణలతో కూడిన సంప్రదాయ ఆచారాలతో ప్రమాణ స్వీకారం జరిగినట్లు నేపాల్ మీడియా వెల్లడించింది. 

ర్యాపర్ టు పీఎం.. వయా జెన్ జెడ్ ఉద్యమం:

ర్యాపర్ గా ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తూ సరదాగా గడిపే వ్యక్తి.. అనతి కాలంలోనే నేపాల్ పాలనా పగ్గాలు పట్టాడంటే మాటలు కాదు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధికారంలో అవినీతి,  బంధుప్రీతి, ప్రజావ్యతిరేక పాలనతో పెల్లుబికిన ఉద్యమాలు.. షాను ప్రధాని పీఠం అధిరోహించేందుకు కీలకంగా మారాయని చెప్పవచ్చు. నేపాల్ లో పెల్లుబికిన జెన్–జెడ్ ఉద్యమాలను క్యాష్​ చేసుకోవడంలో బాలేన్ షా సక్సెస్ అయ్యారు. 

1990లో ఖాట్మండులో జన్మించిన బాలేంద్ర షా వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్. ఆయనకు ఇండియాతో మంచి సంబంధాలున్నాయి.  కర్ణాటకలో ఇంజనీరింగ్ చదివారు. 2013లో ఒక రాప్ బ్యాటిల్ ద్వారా ఆయన పాపులర్ అయిన షా.. తన పాటల ద్వారా సమాజంలోని కుళ్లును, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని ప్రశ్నిస్తూ యువతకు ఐకాన్‌గా మారారు. ముఖ్యంగా షా పాడిన బలిదాన్ వంటి పాటలు యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధించాయి. బ్లాక్ స్కేర్ కళ్లద్దాలు, బ్లాక్ బ్లేజర్ ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్.

ప్రభుత్వంపై మాటలతో..పాటలతో తూటాలు వదులుతూ యూత్ ఐకాన్ గా మారిన షా.. ఒంటరిగా రాజకీయ ప్రవేశం చేశాడు. 2022లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఖాట్మండు మేయర్ పదవికి పోటీ చేసి, దశాబ్దాలుగా ఏలుతున్న పార్టీలను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మేయర్‌గా నగరాన్ని శుభ్రం చేయడం, అక్రమ కట్టడాలను కూల్చివేయడం వంటి కఠిన నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు.  ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి వంటి దిగ్గజాలను వారి సొంత నియోజకవర్గాల్లోనే ఓడించి చరిత్ర సృష్టించాడు.

అవినీతికి వ్యతిరేకంగా ‘జన్ జడ్ రెవల్యూషన్’..

నేపాల్ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ 2025 సెప్టెంబర్‌లో వచ్చిందని చెప్పవచ్చు. సోషల్ మీడియా బ్యాన్‌తో ప్రారంభమైన జెన్ Z ఉద్యమం, అవినీతి, నిరుద్యోగం, సామాజిక అన్యాయాలపై భారీ నిరసనలకు దారితీసింది. ప్రభుత్వం దాన్ని అణచివేయడానికి ప్రయత్నంలో, 19 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా హింస, అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ఉద్యమం చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చేసింది.

జెన్ Z యువతలో పెల్లుబికిన విప్లవ జ్వాలను లీడ్ చేయడంలో బాలెన్ షా సక్సెస్ అయ్యారు. నిరసనకారులకు మద్దతు ఇస్తూ.. ఉద్యమానికి నాయకత్వం వహించి.. యువతకు ఆశాకిరణంగా మారారు. అనేక మంది జెన్ Z నాయకులు  షాను ముందస్తు ప్రధానిగా కోరుకున్నా, ఎన్నికల వరకు వేచి ఉండాలని నిర్ణయించారు.2026 మార్చి 5న జరిగిన సాధారణ ఎన్నికల్లో బాలెన్ నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) భారీ విజయం సాధించింది. 275 సీట్ల పార్లమెంటులో దాదాపు 184 సీట్లు సాధించి భారీ మెజారిటీ తెచ్చుకుంది. 

బాలెన్ తాను పోటీ చేసిన జహ్పా-5 నియోజకవర్గంలో మాజీ ప్రధాని ఓలీని కూడా భారీ తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. ఇలా ర్యాపర్ నుంచి ఇంజనీర్, మేయర్ నుంచి నేపాల్ అతి చిన్న వయస్కుడైన ప్రధానమంత్రి వరకు... బాలేంద్ర షా ప్రయాణం జెన్ Z శక్తిని, మార్పు దిశగా యువత ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం నేపాల్‌లో కొత్త యుగం మొదలైంది... బాలెన్ షా నాయకత్వంలో దేశం ఎలా మారుతుందో చూడాలి!