న్యూఢిల్లీ: హైదరాబాద్ కంపెనీ నెఫ్రోప్లస్ (నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్) ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నుంచి అనుమతి పొందింది. ఈ ఐపీఓలో రూ.353.4 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్ల ఇష్యూ ఉంటుంది. దీంతో పాటు కంపెనీ షేర్‌హోల్డర్లు ఓఎఫ్‌ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) ద్వారా 1.27 కోట్ల షేర్లను విక్రయిస్తారు. ఫ్రెష్ షేర్ల జారీతో వచ్చిన ఫండ్స్‌ను కొత్త డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటుకు, అప్పుల చెల్లింపులకు, కార్పొరేట్ అవసరాలకు వాడతామని నెఫ్రోప్లస్ తమ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) లో పేర్కొంది. మరోవైపు రెన్యూవబుల్ కరెంట్ సప్లయ్ చేసే క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ ఐపీఓ ద్వారా రూ.5,200 కోట్లు సేకరించేందుకు సెబీ నుంచి అనుమతులు పొందింది. కంపెనీ డీఆర్‌హెచ్‌పీ ప్రకారం, ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా రూ.1,500 కోట్లు, ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ.3,700 కోట్లు సేకరించనుంది.
13న ఫుజియామ పవర్ ఐపీఓ
రూఫ్‌టాప్‌ల కోసం సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫుజియామ పవర్ సిస్టమ్స్ తన రూ.828 కోట్ల ఐపీఓను ఈ నెల 13న ప్రారంభించనుంది. ఇష్యూ 17న ముగుస్తుంది. ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.216-–రూ.228గా నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ.600 కోట్ల తాజా షేర్ల ఇష్యూతో పాటు, రూ.228 కోట్ల ఓఎఫ్‌ఎస్ ఉంటుంది. ఈ ఫండ్స్‌ను మధ్యప్రదేశ్‌లో ప్లాంట్ ఏర్పాటుకు, అప్పులు చెల్లించడానికి, ఇతర వ్యాపార అవసరాలకు వినియోగించనున్నారు. 2024–25లో రూ.1,540 కోట్ల ఆదాయంపై రూ.156 కోట్ల నికర లాభాన్ని కంపెనీ సాధించింది.
