
రెండేళ్ల క్రితం వచ్చిన సౌత్ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌ను చూడటానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఫలితంగా విడుదలైన నెలలోపే 1.65 బిలియన్ అవర్స్ స్ట్రీమింగ్‌తో రికార్డు సృష్టించింది. అంతేకాదు ఎమ్మీ అవార్డుల్లో ఏకంగా 14 నామినేషన్స్ దక్కించుకొని.. ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. త్వరలోనే 'స్క్విడ్‌గేమ్ 2' రాబోతోంది.
బ్రెజిల్‌లో జరిగిన నెట్‌ఫ్లిక్స్ టుడుమ్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇందులోని నటీనటులను పరిచయం చేశారు. తొలి సీజన్‌లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ.. రెండో సీజన్‌లో కూడా ఆయా పాత్రల్లో నటించనున్నారు. వీరితో పాటు యిం సి వాన్, కాంగ్ హా న్యూల్, పార్క్ సంగ్ హూన్, యాంగ్ డాంగ్ గ్యూన్ కొత్తగా స్క్విడ్ గేమ్ క్యాస్టింగ్‌లో చేరారు. 2024లో సీజన్-2 స్ట్రీమింగ్ కానుంది.
డబ్బు ఆశ చూపి ప్రాణాలు తీయడం
పేదరికంలో మగ్గుతున్న వారిని గుర్తించి.. వారికి డబ్బుపై ఆశ కలిగించి వారిలో కొందరి ప్రాణాలు తీయడమే స్క్విడ్ గేమ్ కథాంశం. తొలి భాగంలో 456 మంది ఒక్కచోటికి చేరినా.. వారిలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? చివరకు ఎంతమంది మిగిలారు? ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సిరీస్ సాగుతుంది. అంతేకాదు, తోటివారి ప్రాణాలు కాపాడేందుకు జరిగే సంఘర్షణ నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. త్వరలో రాబోతున్న 'స్క్విడ్‌గేమ్ 2' అంతే ఉత్కంఠను కలిగించొచ్చని టీజర్ ద్వారా తెలుస్తోంది.
Lee Jung-jae, Lee Byung-Hun, Wi Ha-jun, and Gong Yoo will all be returning for Squid Game Season 2!
— Netflix (@netflix) June 17, 2023
And #TUDUM just revealed four new actors who will be joining the cast! pic.twitter.com/0iofoBQ1kB