వార్నర్ బ్రదర్స్ స్టూడియో కొనే రేసులో నెట్‌ఫ్లిక్స్.. బ్యాంకర్లతో చర్చలు..

వార్నర్ బ్రదర్స్ స్టూడియో కొనే రేసులో నెట్‌ఫ్లిక్స్.. బ్యాంకర్లతో చర్చలు..

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మరో పెద్ద అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ సంస్థ.. స్టూడియో, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని ఉద్దేశిస్తూ నెట్‌ఫ్లిక్స్ చర్చలు జరుపుతోందని వెల్లడైంది.

ఈ ప్రక్రియలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ మోయెలిస్‌ అండ్‌ కంపెనీ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించిందని తెలుస్తోంది. ఇదే బ్యాంక్ స్కైడాన్స్ మీడియాకు పరమౌంట్ గ్లోబల్ కొనుగోలు ఒప్పందంలో సలహా ఇచ్చిన సంస్థ కూడా. నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే వార్నర్ బ్రదర్స్‌ ఆర్థిక వివరాల డేటా యాక్సెస్‌ను పొందింది. ఇవన్నీ చూస్తుంటే కంపెనీ బిడ్డింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ, అలాగే నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం ఈ విషయంపై స్పందించటానికి నిరాకరించాయి. ఈ విలీనంతో నెట్‌ఫ్లిక్స్‌కు హ్యారీ పోటర్, డీసీ కామిక్స్‌ వంటి ప్రపంచ ప్రసిద్ధ ఫ్రాంచైజీలపై హక్కులు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా వార్నర్ బ్రదర్స్‌ టెలివిజన్ స్టూడియో నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఇప్పటికే.. “రన్నింగ్ పాయింట్” “యూ” “మేడ్స్” వంటి ప్రసిద్ధ సిరీస్‌లను నిర్మిస్తోంది.

దీనికి తోడు HBO, HBO Max వంటి ప్రీమియం కంటెంట్‌తో నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫారమ్ మరింత బలంగా మారే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ టెడ్ సారాండోస్‌ ఇటీవల పెట్టుబడిదారులతో మాట్లాడుతూ.. మార్కెట్‌లో సరైన అవకాశం ఉంటే కొనుగోలు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన స్పష్టంగా వార్నర్ బ్రదర్స్‌ సముదాయంలోని కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌లు (సీఎన్న్, టీఎన్‌టీ, ఫుడ్ నెట్‌వర్క్, యానిమల్ ప్లానెట్) వంటి లెగసీ మీడియా ఛానెళ్ల మీద నెట్‌ఫ్లిక్స్‌కు ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పారు.

ఇక వారం క్రితం వార్నర్ బ్రదర్స్‌ డిస్కవరీ, స్కైడాన్స్, పరమౌంట్ గ్లోబల్ నుంచి మొత్తం సంస్థను కొనుగోలు చేయాలన్న మూడు ఆఫర్లు అందుకున్నట్టు ప్రకటించింది. ఇప్పుడీ పరిణామాలతో వార్నర్ బ్రదర్స్‌ బోర్డు సంస్థను విడగొట్టాలా లేక మొత్తం అమ్మకానికి పెట్టాలా అనే రెండు మార్గాల మధ్య ఆలోచనలో పడింది. కామ్‌కాస్ట్‌ అధ్యక్షుడు మైక్ కావనాగ్‌ కూడా తమ సంస్థకు అనుకూలమైన మీడియా ఆస్తుల కొనుగోలుపై పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. నియంత్రణ సంబంధిత అడ్డంకులు ఉన్నప్పటికీ.. పెద్ద ఒప్పందాలకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.