లాక్ డౌన్ ప్రకటించిన నెదర్లాండ్స్

లాక్ డౌన్ ప్రకటించిన నెదర్లాండ్స్

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ ఉండటంతో కొత్త వేరియంట్ భయం మరింత పెరిగిపోతోంది. దీంతో నేటి నుంచి నెదర్లాండ్స్ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. జనవరి 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రధానమంత్రి మార్క్ రూటే తెలిపారు. కల్చరల్, ఎంటర్ టైన్ మెంట్ ఈవెంట్స్ అన్నీ బంద్  చేయాలని ఆదేశాలిచ్చారు. జనవరి 9 వరకు స్కూళ్లు మూసి ఉంచాలని చెప్పారు. జనవరి రెండో వారం వరకు యూరప్ లో కేసుల తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ చీఫ్ చెప్పారు. 

అటు బ్రిటన్ లోనూ కేసులు పెరుగుతుండటంతో.. ఆంక్షలపై ఆలోచిస్తున్నారు. త్వరలోనే లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు లండన్ మేయర్ తెలిపారు. హెల్త్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని.. టెస్టింగ్, ట్రేసింగ్ స్పీడప్ చేయాలని ఆదేశించారు. బ్రిటన్ లో కేసులు పెరగడంతో.. దాన్ని కూడా హై రిస్క్ దేశాల జాబితాలో చేర్చినట్టు జర్మనీ ప్రకటించింది. బ్రిటన్ నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లో పర్ ఫెక్ట్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలిచ్చింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఫ్రాన్స్, డెన్మార్క్ ను హైరిస్క్ దేశాలుగా ప్రకటించింది జర్మనీ. 

ఇక ఫ్రాన్స్ లో ఆంక్షలు మరింతగా పెంచాలని నిపుణుల కమిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఐర్లాండ్ లో బార్లు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. డెన్మార్క్ లో సినిమా హాళ్లు, ఇతర సమావేశ మందిరాలు మూసేస్తున్నారు. ఆస్ట్రేలియాలోనూ ఆంక్షలు పెట్టే ఆలోచనలో  ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ స్పీడప్ చేశాయి దేశాలు. చాలా దేశాల్లో ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ దాదాపుగా పూర్తయ్యింది. ఇప్పుడు పిల్లలకు వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెట్టాయి. 

For More News..

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఫిబ్రవరిలో థర్డ్ వేవ్