
ఫార్మాట్ ఏదైనా భారీ ఛేజింగ్ అంటే చాలా కష్టం. అగ్ర జట్టు అయినా సరే కళ్ళముందు బిగ్ టార్గెట్ కనబడితే ఒత్తిడిలో చేతులెత్తేస్తారు. ఇక వన్డే క్రికెట్ లో భారీ ఛేజింగ్ ఇంకా కష్టంతో కూడుకున్నది. అయితే నెదర్లాండ్స్ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. స్కాట్లాండ్ పై 370 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ లో భాగంగా గురువారం (జూన్ 12) ఈ అద్భుత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్కాట్లాండ్ స్టార్ ఓపెనర్ మున్సీ ఒక్కడే 191 పరుగులు చేసి జట్టు మొత్తం చేసిన స్కోర్ లో సగానికి పైగా పరుగులు చేశాడు. కెప్టెన్ మాథ్యూ క్రాస్ (59) హాఫ్ సెంచరీతో రాణించగా.. మైఖేల్ లీస్క్ (28) చివర్లో మెరుపులు మెరిపించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో మైఖేల్ లెవిట్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసి గెలిచింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో డచ్ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ చివరి వరకు క్రీజ్ లో ఉండి అజేయ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.
130 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 158 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓడౌడ్ కు తేజ నిడమానూరు (51), నోహ్ క్రోస్ (50) హాఫ్ సెంచరీలతో చక్కని సహకారం అందించారు. ఓవరాల్ గా ఇది వన్డే క్రికెట్ లో నాలుగో అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. 2005 లో జోహనెస్ బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 434 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి అగ్ర స్థానంలో ఉంది. భారీ సెంచరీతో జట్టును గెలిపించిన మాక్స్ ఓడౌడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Max O'Dowd's sensational innings against Scotland in #CWCL2 helped Netherlands seal their second-highest run chase in ODIs 🔥#SCOvNED 📝: https://t.co/HBHkuTl5d6 pic.twitter.com/MWibkq7dZx
— ICC (@ICC) June 12, 2025