నీ భార్య ఇమిగ్రెంట్ల కుమార్తె కదా..? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‎పై నెటిజన్లు ఫైర్

నీ భార్య ఇమిగ్రెంట్ల కుమార్తె కదా..? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‎పై నెటిజన్లు ఫైర్

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌కు గురయ్యారు. “వలసలు పెరగడం అంటే అమెరికన్ డ్రీమ్‌‌ను దొంగిలించడమే” అంటూ ఆయన ఎక్స్‌‌లో చేసిన పోస్టుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. “నీ భార్య ఉషా వాన్స్ భారతీయ ఇమ్మిగ్రెంట్ల కుమార్తె కదా..? మీ కొడుకులు ఈవాన్, వివేక్, కూతురు మిరబెల్ కూడా ఇమ్మిగ్రెంట్ నేపథ్యం నుంచే వచ్చారు కదా..?” అని గుర్తుచేశారు. అమెరికన్ డ్రీమ్ దొంగలు మీ ఇంట్లోనే ఉన్నారని ఓ యూజర్ విమర్శించగా.. ముందు ఉషాను, పిల్లలను భారత్‌‌కు పంపండి, ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ మీద లెక్చర్ ఇవ్వండని మరో నెటిజన్ తీవ్రంగా స్పందించారు.

“మీ భార్యా పిల్లల విమానం టికెట్లు బుక్ చేసిన ఫొటో పెట్టండి సార్, మేమంతా వెయిట్ చేస్తున్నాం” అంటూ మరో యూజర్ ట్రోల్ చేశారు. మరికొందరు “ మీరు మీ ఇన్-లాస్‌‌‌‌‌(అత్తామామ)ను ద్వేషించడం అర్థం చేసుకోగలం. కానీ, ఇది కాస్త ఓవర్ కదా..?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ ఆపరేషన్ల తర్వాత వలస కార్మికులు పనిచేయడానికి రావడం లేదని పేర్కొంటూ లూసియానా కన్ స్టక్షన్ కంపెనీ ఓనర్ ఓ వీడియో చేశారు. 

దానికి రిప్లైగా జేడీ వాన్స్ స్పందిస్తూ..“పెద్ద ఎత్తున వలసలు (మాస్ మైగ్రేషన్) అంటే అమెరికన్ డ్రీమ్‌‌ను దొంగిలించడమే. ఇది ఇప్పటికీ కొనసాగుతున్నది. కొందరు బాగా డబ్బున్న వ్యాపారవేత్తలు తమ స్వార్థం కోసం వలసలకు మద్దతిస్తున్నారు. భారీగా ఖర్చుపెట్టి మైగ్రేషన్ ను ప్రోత్సహిస్తున్నారు" అని ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. దాంతో నెటిజన్లు ఇలా ఆయనపై ఫైర్ అవుతున్నారు.