ఆస్పత్రులు దోచుకుంటుంటే ఏం చేస్తున్నరు? కేటీఆర్ కు నెటిజన్ల ప్రశ్న

ఆస్పత్రులు దోచుకుంటుంటే ఏం చేస్తున్నరు? కేటీఆర్ కు నెటిజన్ల ప్రశ్న
  • కరోనా ట్రీట్​మెంట్​కు అడ్డగోలు ఫీజులపై కేటీఆర్​కు నెటిజన్ల ప్రశ్న
  • ఆరోగ్యశ్రీలో కరోనాను ఎప్పుడు చేరుస్తారో చెప్పాలని నిలదీత
  • ఆక్సిజన్, రెమ్డిసివిర్ పేదోళ్లకు దొర్కుతలేవన్న జనం
  • ఫీజులపై జీవో ఇచ్చినం.. దోపిడీ చేస్తే చర్యలుంటాయన్న మంత్రి
  • ఆరోగ్యశ్రీలోకి కరోనా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి  
  • వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమ్డిసివిర్ సప్లై కేంద్రం పరిధిలోనే ఉందని వివరణ
  • కరోనా కట్టడికి సర్కారు చర్యలపై ట్విట్టర్​లో ‘ఆస్క్ కేటీఆర్’


హైదరాబాద్, వెలుగు:ప్రైవేట్​లో కరోనా వైద్యానికి ఇష్టమొచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నారని, సర్కారు ఉత్తర్వులిచ్చినా ఎందుకు పట్టించుకోవట్లేదని మంత్రి కేటీఆర్​ను నెటిజన్లు ప్రశ్నించారు. ప్రజలపై భారం మోపుతున్న ప్రైవేట్ హాస్పిటల్​పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడిగారు. ప్రైవేట్​లో ఫీజుల దోపిడీపై జీవో ఉన్నా చర్యలు తీసుకోవట్లేదని ఒక నెటిజన్ అడగ్గా చర్యలు తీసుకుంటామని చెప్పిన కేటీఆర్.. తర్వాత ఇంకొకరు ఇదే సమస్యపై ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగితే జీవో ఇచ్చామని బదులిచ్చారు. ప్రజలంతా కొవిడ్–19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నారని, ‘ప్లీజ్ ఆరోగ్యశ్రీలో చేర్చండి.. ఎప్పుడు చేరుస్తారో చెప్పండి’ అని మరొకరు అడగ్గా సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగుల ట్రీట్‌‌‌‌మెంట్ ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఒకే విధానం రూపొందించాలని సూచించగా దానిపై దృష్టి సారిస్తున్నామన్నారు. కరోనా పరిస్థితులు, కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో ‘ఆస్క్ కేటీఆర్’ నిర్వహించారు. వివిధ అంశాలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.

రెమ్డిసివిర్, ఆక్సిజన్ కంట్రోల్ కేంద్రానిదే..

వ్యాక్సిన్, ఆక్సిజన్ సప్లై, రెమ్డిసివిర్​పై తమకు ఏ బాధ్యత లేదన్నట్లు పూర్తిగా కేంద్రమే అని కేటీఆర్ బదులిచ్చారు. రెమ్డిసివిర్, ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, దీంతో పేద ప్రజలు వాటిని పొందలేకపోతున్నారని ప్రశ్నించగా.. ఆక్సిజన్ కొరత దేశవ్యాప్తంగా ఉందని, ఇప్పుడు కంట్రోల్ అంతా కేంద్రం పరిధిలో ఉందన్నారు. ఆక్సిజన్, రెమ్డిసివిర్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తున్నామన్నారు. వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్న అనేక మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. గిఫ్ట్​ఏ స్మైల్ కింద కేటీఆర్ బర్త్​డేకి ఇచ్చిన అంబులెన్స్‌‌ లు పనిచేయట్లేదని ఒకరు అడగ్గా 90 పనిచేస్తున్నాయని చెప్పారు.

రాష్ట్రానికి కావాల్సినన్ని డోసులు వస్తలేవు

వ్యాక్సిన్ డోర్ టు డోర్ వేయాలంటే డోసులు అందుబాటులో ఉండాలని కేటీఆర్ చెప్పారు. రోజుకు 9 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే యంత్రాంగం ఉందని.. స్టాక్ ఉంటే అందరికీ 45 రోజుల్లో అంతా పూర్తవుతుందన్నారు. వ్యాక్సిన్లు సరఫరా కేంద్రం చేతుల్లో ఉన్నందున రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు అందడం లేదన్నారు. దేశంలో తయారవుతున్న వాక్సిన్లలో 85 శాతం కేంద్రం పరిధిలో ఉందన్నారు. మిగిలిన 15 శాతం నుంచే రాష్ట్రాలు,  ప్రైవేటు సంస్థలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. 

రికవర్ అయ్యాక బలహీనంగా అనిపిస్తోంది

కరోనా బారిన పడి ఎలా కోలుకున్నారో సొంత అనుభవం చెప్పాలని ఒక నెటిజన్ అడగగా, ‘కరోనా సోకినప్పుడు వరుసగా ఏడ్రోజులు ఫీవర్ నుంచి హై ఫీవర్ వరకు జ్వరం కొనసాగింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఉంది. నేను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్, హైపర్ టెన్షన్ నియంత్రణ కొంత సవాలుగా ఉండేది. డాక్టర్ల సలహాలతో వైరస్‌‌‌‌ను అధిగమించా. ప్రస్తుతం కొంత బలహీనంగా అనిపిస్తోంది. అయినా సాధారణ స్థితికి చేరుకున్నా’నని చెప్పారు. కరోనా వల్ల అనాథలైన పిల్లల కోసం ఏదైనా చేయండని అడిగితే.. ‘మంచి ఆలోచన, పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగ‌‌‌‌‌‌‌‌స్ కేసులు పెర‌‌‌‌‌‌‌‌గుతున్నాయ‌‌‌‌‌‌‌‌ని ఒక‌‌‌‌‌‌‌‌రు చెప్పగా దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌‌‌‌‌‌‌‌న్నారు.

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకుంటున్నరు 

ప్రభుత్వం కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలను కొంత మంది దుష్ప్రచారం, అసత్యాలతో బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో అయోమయపడొద్దని, ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో కూడినవేననని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో రాష్ట్రంలోని ఫార్మా ఇండస్ట్రీ నేషనల్ ఇంపార్టెన్స్ గురించి అందరూ అనుకుంటున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మాసిటీ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుగా మారబోతోందని చెప్పారు. 

ఫార్ములాపై కేంద్రం నిర్ణయం తీస్కోవాలి

కొవాగ్జిన్ ఫార్ములాను భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకొని వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడాలన్న సూచనపై స్పందిస్తూ దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ తయారీదారులైన భారత్ బయోటెక్, సీరం,  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన గ్లోబల్ టెండర్లను కేంద్రం అనుమతించిన మూడు వ్యాక్సిన్ తయారీదారులు పాల్గొనే అవకాశం ఉందని.. త్వరలో ఫైజర్, మోడెర్నా కంపెనీల వ్యాక్సిన్లకూ అనుమతి లభిస్తుందన్నారు.