కాంగ్రెస్ మొదలుపెట్టిందని.. టీఆర్ఎస్ పూర్తి చేయట్లే..

కాంగ్రెస్ మొదలుపెట్టిందని.. టీఆర్ఎస్ పూర్తి చేయట్లే..

నెట్టెంపాడు కాలువలు ఎక్కడికక్కడ తెగుతున్నయ్
తెలంగాణ వచ్చి ఆరేండ్ల యినా లైనింగ్ చేయలే
రెండు లక్షల ఆయకట్టు లక్ష్యంతో ఎత్తిపోతలు
తాజాగా పలుచోట్ల గండ్లు.. నీట మునిగిన పంటలు
తమకు నీరందుతుందో లేదోనని ఆందోళనలో రైతులు

గద్వాల, వెలుగు: రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో ప్రారంభించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిరక్ష్ల్యం చేస్తోంది. పాలమూరు కరువును పారదోలే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలోఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అదే దీనిపాలిట శాపంగా మారింది. ఇటీవల మొదలుపెట్టిన ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్నా, తెలంగాణ వచ్చి ఆరేండ్లసంది ఈ కాలువలకు కనీసం లైనింగ్ చేయలేదు. దీంతో మంగళవారం కురిసిన వర్షానికి మెయిన్, బ్రాంచి కెనాల్స్ కు పలుచోట్ల గండ్లుపడ్డాయి. కాల్వల వెంబడి వందల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. ఈ గండ్ల కారణంగా తమకు నీరందుతుందో లేదోనని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

2 లక్షల ఎకరాల ఆయకట్టు ..
జూరాల బ్యాక్ వాటర్ నుంచి గుడ్డందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లలోకి లిఫ్టుచేసి, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్స్ద్ ద్వారా గద్వాల నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా నెట్టెంపాడు లిఫ్టును డిజైన్ చేశారు. ప్రాజెక్టు పనులు ఇంకా 10 శాతం మిగిలే ఉన్నాయి. ప్రధానంగా 109 ప్యాకేజీ పనులతో పాటు రెండు రిజర్వాయర్ పనులు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టు అనే కారణంతో టీఆర్ఎస్ సర్కార్ ఈ పనులు చేయడం లేదనే విమర్శలున్నాయి.

ప్రధాన కెనాల్ కు కోతలు
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గుడ్డందొడ్డి రిజర్వాయర్ నుంచి వచ్చే మెయిన్ కెనాల్ సైతం ఏడు చోట్లతీవ్ర కోతకు గురైంది. పెద్ద కాలువ వెంబడి ఉండే దారులు మూడు మీటర్లు కోసుకుపోయి ఏ క్షణమైనా తెగేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ బాటల వెంట రైతులు పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారు. 04 కెనాల్ పరిధిలోని కోతుల గిద్ద దగ్గర ప్రధాన కాలువకు 3 చోట్ల గండ్లు పడి, పంట పొలాలు మునిగిపోయాయి. 109 ప్యాకేజీ పరిధిలోని సబ్ కెనాల్ కూడా మూడు చోట్లగండ్లు పడి వందల ఎకరాల్లో చేన్లు మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాంపల్లె, మార్లబీడు, ఓబులంపల్లి గ్రామాల్లోకి వరద నీరు రావడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. చింతరేవుల దగ్గర రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గట్టుకు వెళ్లే దారిలోనూ రవాణా కష్టమవుతోంది.

లిఫ్టు మోటార్లు బంద్
కాలువలకు గండ్లుపడడంతో నెట్టెంపాడు ఆఫీసర్లు అలర్ట్ అయి మోటార్లను నిలిపివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాలువలకు లైనింగ్ చేయకపోవడం వల్లే ప్రతిసారీ తెగుతున్నాయని అటు ఆఫీసర్లు, ఇటు రైతులు ఆరోపిస్తున్నారు. తరచూ గండ్లు పడుతుండడంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లైనింగ్ లేక రెండు లక్షల ఎకరాలకు బదులు లక్ష ఎకరాలకే నీరందుతోందనీ, ఇలా గండ్లు పడుతూ పోతే 50 వేల ఎకరాలు మించి పారదంటున్నారు . ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించి కాల్వల లైనింగ్ పనులు పూర్తి చేసేలా సర్కారుపై ఒత్తిడి తేవాలని రైతులు కోరుతున్నారు.

లైనింగ్ చేయాలె
తెలంగాణ ప్రభుత్వం వస్తేమాకు మంచి రోజులు వస్తాయనుకున్నం. కానీ ఏండ్లు గడుస్తున్నా కాలువ లైనింగ్ పనులు చేస్తలేరు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే కాల్వలు ఎక్కడికక్కడ తెగి పంటలు మునుగుతున్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కాలువ లైనింగ్ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలి.
‑ రాముడు, ఆయకట్టు రైతు

రైతులను ఆదుకోవాలి
నెట్టెంపాడు కాలువలు తెగిపోయి, అకాల వర్షాలకు పంట కొట్టుకుపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ప్రెస్ నోట్ విడుదల చేశారు. నెట్టెంపాడు కాల్వలకు లైనింగ్ చేయకపోవడం, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్లే పంట కాలువలకు గండ్లు పడ్డాయని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చి ఆరేళ్లవుతున్నా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో గంపెడు మట్టి తీయలేదని విమర్శించారు. రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
– మాజీ మంత్రి డీకే అరుణ

For More News..

ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డరు

అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..

వార్డెన్ నిర్లక్ష్యంతో 14 మంది అంధులకు కరోనా

సెక్రటేరియట్‌ ‌డిజైన్‌లో మార్పులు