నెట్టెంపాడు కాలువల లైనింగ్‌‌కు  సర్కార్ సన్నద్ధం.. రూ.373 కోట్లతో ప్రపోజల్స్ రెడీ

నెట్టెంపాడు కాలువల లైనింగ్‌‌కు  సర్కార్ సన్నద్ధం.. రూ.373 కోట్లతో ప్రపోజల్స్ రెడీ
  • ప్రభుత్వం నుంచి గ్రీన్​ సిగ్నల్​ రాగానే పనులు షురూ
  • పనులు పూర్తయితే అదనంగా 80 వేల ఎకరాలకు సాగునీరు

గద్వాల, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో కృష్ణా నది వరద జలాలపై ఆధారపడి నిర్మించిన నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువల లైనింగ్ కోసం రూ.373 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏడు రిజర్వాయర్లు నిర్మించారు. ప్రస్తుతం మూడు రిజర్వాయర్ల నుంచే నీరు విడుదల చేస్తున్నారు.

అయితే మెయిన్ కెనాల్స్, రైట్–లెఫ్ట్ కెనాల్స్‌‌కు లైనింగ్ లేకపోవడంతో భారీగా నీటి వృథా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 2 లక్షల ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పుడు లక్షా 20 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. కాల్వల లైనింగ్​లేకపోవడంతో భారీగా నీరు వేస్టేజీ అవుతోంది.

రెండు టీఎంసీల నీటి వృథా..

ప్రతి పంట సీజన్‌‌కు దాదాపు రెండు టీఎంసీల నీరు వృథా అవుతోందని ఇరిగేషన్ నిపుణుల అంచనా. ఒక టీఎంసీ నీటితో సుమారు 10 వేల ఎకరాలకు సాగు చేయవచ్చు. ఈ లెక్కన 20 వేల ఎకరాలకు సరిపడే నీరు వృథా అవుతోందని చెబుతున్నారు. లైనింగ్ లేకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది.

164 కిలోమీటర్ల కాలువలు..

ఫేజ్–1లో 84 కిలోమీటర్లు, ఫేజ్–2లో 80 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. మొత్తం 164 కిలోమీటర్ల మెయిన్ కెనాల్స్‌‌తో పాటు సుమారు 100 కిలోమీటర్లకు పైగా డిస్ట్రిబ్యూటరీ, సబ్‌‌డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు లైనింగ్ చేయకపోవడంతో నీరు ఎక్కడికక్కడే వృథా అవుతోంది. తొలి దశలో మెయిన్ కెనాల్స్ లైనింగ్‌‌కు మాత్రమే ప్రపోజల్స్ సిద్ధం చేశారు.

బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. 90 శాతం పనులు పూర్తయ్యినా మిగిలిన 10 శాతం పనులు చేయకపోవడంతో పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం సాధ్యం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పనులపై దృష్టి సారించింది. లైనింగ్​ పనులకు ప్రపోజల్స్​ పంపాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆఫీసర్లు ప్రపోజల్స్​ రెడీ చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే.. లైనింగ్​ పనులకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వం సిగ్నల్​ ఇస్తే పనులు షురూ

నెట్టెంపాడు కెనాల్స్ లైనింగ్‌‌కు ఎస్టిమేట్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాం. లైనింగ్ లేకపోవడం వల్ల నీటి వృథా అవుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పనులను లైన్​ క్లియర్​ అవుతుంది.– రహీముద్దిన్​, ఎస్​సీ, ఇరిగేషన్ శాఖ