ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు : నేడు రానున్న యువతి పోస్టుమార్టం రిపోర్ట్

ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు : నేడు రానున్న యువతి పోస్టుమార్టం రిపోర్ట్

ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్ట్ గా కొత్త సీసీ టీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. హోటల్ నుంచి బాధిత యువతి బయటికి రావడం, మరో స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్లడం ఈ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కొద్ది సేపటి తర్వాత బాధిత యువతి స్నేహితురాలు స్కూటీ నుంచి దిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. ఆమెతో పాటు హోటల్ మేనేజర్ ను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధిత యువతితో మాట్లాడిన వారిని సైతం అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నారు. మరోవైపు బాధిత యువతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ రిలీజ్ కానుంది. ఈ రిపోర్ట్ బయటికొస్తే కీలక విషయాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై సమాధానాల్లేని ప్రశ్నలెన్నో ఉన్నాయి. వాటన్నిటికి ఆన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు కారులో ఉన్న ఐదుగురు నిందితుల బ్లడ్ శాంపుల్స్ ను FSL ల్యాబ్ కు పంపించారు. ఈ ఐదుగురిలో ఆల్కహాల్ ఎంత మంది తీసుకున్నారన్న విషయాన్ని చెక్ చేయనున్నారు. అటు బాధిత యువతి కుటుంబాన్ని ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కలవనున్నారు. కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఘటనపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా పోలీసులను ఆదేశించారు. 

ఈ ఘటనలో స్కూటీని ఢీకొట్టిన విషయం కానీ, కారు కింద యువతి చిక్కుకుపోయిన విషయం కానీ గుర్తించలేదని నిందితులు చెప్పినట్టు ఔటర్​ ఢిల్లీ డీసీపీ హరీంద్ర కే సింగ్​ వెల్లడించారు. కారు అద్దాలు పూర్తిగా మూసి ఉండటం.. పెద్ద సౌండ్​తో మ్యూజిక్​ సిస్టం ఆన్​ చేసి ఉండటంతో తమకు బయటి శబ్దాలు వినిపించలేదని తెలిపారన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత బానెట్​ కింద ఏదో తగులుతున్నట్టుగా గుర్తించి చెక్​ చేస్తే యువతి డెడ్​ బాడీ కనిపించిందని, దానిని తొలగించి పరారయ్యామని చెప్పారన్నారు. నిందితుల బ్లడ్​ శాంపిల్స్​ ను పోలీసులు సేకరించారు. వారు లిక్కర్​ తాగారా? లేదా? అనేది మెడికల్​ రిపోర్టులో వెల్లడికానుంది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు పోలీసు కస్టడీ విధించింది.