ఎర్రమంజిల్ కూల్చి.. కొత్త అసెంబ్లీ కట్టాల్సిందే!

ఎర్రమంజిల్ కూల్చి.. కొత్త అసెంబ్లీ కట్టాల్సిందే!
  • కొత్త అసెంబ్లీ నిర్మాణంపై సీఎం కేసీఆర్​ పట్టు
  • హైకోర్టు చెప్పిన అభ్యంతరాలపై అధికారుల అధ్యయనం
  • త్వరలో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలపై దృష్టి
  • ఎర్రమంజిల్ ను కూల్చేందుకు హెరిటేజ్ కన్​జర్వేషన్​ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: ఎర్రమంజిల్ వద్దనే కొత్త అసెంబ్లీ కట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గేది లేదనే ఆలోచనలో సీఎం ఉన్నారని అంటున్నాయి. ‘ఎర్రమంజిల్ ను కూల్చాలి. అక్కడే కొత్త అసెంబ్లీ కట్టాలి. అందుకు ఉన్న అడ్డంకులను తొలిగించాలి’అని సీఎం కేసీఆర్ ఈ మధ్య ఓ సమీక్షా సమావేశంలో అన్నారని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులు హైకోర్టు చెప్పిన అభ్యంతరాలపై అధ్యయనం చేస్తున్నారని తెలిసింది.

కేబినెట్​ నిర్ణయానికి కట్టుబడాలని..

జూన్ 27న కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాల కోసం సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. అయితే 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఎర్రమంజిల్ భవనం వారసత్వ సంపదగా ఉందని, దాన్ని ఎలా కూల్చుతారని కొందరు కోర్టుకు వెళ్లారు. పిటిషనర్ల వాదనలను పరిశీలించిన హైకోర్టు ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ సంపద నుంచి తొలగించే ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అభ్యంతరం చెప్పింది. ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీని నిర్మించేందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సెప్టెంబర్​16న హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సీఎం కేసీఆర్ కొత్త అసెంబ్లీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ మధ్య ఓ సమీక్షా సమావేశంలో కొత్త అసెంబ్లీ నిర్మాణాన్ని సీఎం ప్రస్తావించారని తెలిసింది. కేబినెట్ నిర్ణయం తీసుకున్న మేరకు కొత్త అసెంబ్లీ భవనాన్ని ఎర్రమంజిల్ లోనే కట్టాలని ఆయన అన్నట్టు సమాచారం.

హెరిటేజ్ కన్​​జర్వేషన్​ కమిటీ ఏర్పాటు

ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మించాలంటే రెండు మార్గాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు. ఒకటి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం. సుప్రీంకు వెళ్లితే తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. రెండోది నిబంధనల మేరకు ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ సంపద నుంచి తొలగించే ప్రక్రియను పూర్తి చేయడం. ఏదైనా భవనాన్ని వారసత్వ సంపద జాబితా నుంచి తొలగించాలంటే హెరిటేజ్ కన్​జర్వేషన్​కమిటీ ఏర్పాటు వేయాలి. ఆ కమిటీ భవనం సామర్థ్యాన్ని పరిశీలించి నివేదిక ఇస్తుంది. నివాసానికి అనుకూలంగా లేదని చెపితే బిల్డింగ్ కూల్చవచ్చు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ముందుగా హెరిటేజ్ కన్​జర్వేషన్ కమిటీ ఏర్పాటు చేసే చాన్స్ ఉందని ఓ అధికారి చెప్పారు. ఆర్టీసీ సమ్మె తర్వాత సీఎం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ నిర్మాణంపై దృష్టి పెడుతారని అన్నారు. కొత్త సెక్రటేరియట్ కోసం సీఎం ఇప్పటికే 5 డిజైన్లను పరిశీలించారు. త్వరలో డిజైన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉందని సమాచారం.