
తిమ్మాపూర్, వెలుగు: కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల(22)కు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం లొత్తునూర్ గ్రామానికి చెందిన రాజుతో ఈ నెల 6న వివాహం జరిగింది. శుక్రవారం పీజీ సెట్ ఎంట్రన్స్ రాసేందుకు అఖిల భర్త రాజుతో కలిసి బైక్పై తిమ్మాపూర్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి వచ్చింది. పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా, మహాత్మానగర్ స్టేజీ సమీపంలో వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో అఖిల అక్కడికక్కడే చనిపోగా, రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.