- నిర్మాణాలు, కొనుగోళ్ల కోసం రూ.190.14 కోట్లు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ అగ్రిమెంట్
- హైదరాబాద్ సహా అన్ని జిల్లాలకు ప్రయోజనం
హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న సవాళ్లకు అనుగుణంగా అగ్నిమాపక శాఖను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మల్టిస్టోర్ బిల్డింగ్స్, పరిశ్రమల్లో మంటలు చెలరేగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు కొత్త టెక్నాలజీ, మోడర్న్ఎక్వీప్మెంట్ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.190.14 కోట్లతో శాఖను బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. 100 మీటర్ల నుంచి 200 మీటర్లకు పైగా ఎత్తున్న భవనాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సంప్రదాయ వాహనాలు, సామగ్రితో సహాయ చర్యలు చేపట్టడం కష్టం.
అలాగే గ్రామీణ, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రమాదాల సమయంలోనూ వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఆధునిక యంత్రాలు అవసరం. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖను బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులను రాబట్టాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.
దీంతో ఆ శాఖ డీజీ వై.నాగిరెడ్డి కేంద్ర హోంశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా రూ.190.14 కోట్లతో రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ బలోపేతానికి కేంద్ర హోం శాఖ, రాష్ట్ర అగ్నిమాపక శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.142.61 కోట్లు విడుదల చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.47.53 కోట్లు అందజేయనుంది. 2026 నాటికి ఈ నిధులన్నింటిని వినియోగించనున్నారు.
ఆధునిక పరికరాలు.. కొత్త ఫైర్ స్టేషన్లు
ఎత్తైన భవనాలు, పరిశ్రమల్లో ప్రమాదాల సమ యంలో వినియోగించుకునేందుకు రూ.87.57 కోట్లతో ఆధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా 104 మీటర్ల ఎత్తైన హైడ్రాలిక్ ప్లాట్‌ఫాం, 68 మీటర్ల ఎత్తైన టర్న్‌టబుల్ నిచ్చెన, 32 మీటర్ల ఎత్తైన హైడ్రాలిక్ ప్లాట్‌ఫాం, ఫైర్ ఫైటింగ్ రోబోట్స్, 20 ఇన్‌ఫ్లాటబుల్ రెస్య్కూ బోట్స్, వేగంగా మంటలార్పే హై ప్రెజర్ పంపులతో కూడిన 18 ఫైరింజన్లను కొనుగోలు చేయనున్నారు. రూ.57.04 కోట్లతో రాష్ట్రంలోని 18 ఆఫీసుల ఆధునీకీకరణ, నిర్మాణంతో పాటు ఫైరింజన్లు, అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేయనున్నారు.
ఆధునికరించే, కొత్త బిల్డింగ్లు నిర్మించే వాటిలో రెండు ఫైరింజన్లు ఉన్న సెంటర్లు మేడ్చల్- మల్కాజిగిరి, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, రాజేంద్ర నగర్, షాద్ నగర్.. ఒకే ఫైరింజన్ ఉన్న కేంద్రాలు అలంపూర్, మక్తల్, స్టేషన్ ఘన్‌పూర్, నర్సాపూర్, హుస్నాబాద్, డోర్నకల్, కల్వకుర్తి, పినపాక, బాల్కొండ, ధర్మపురి, నందిపేట ఉన్నాయి. అలాగే రూ.28.52 కోట్లతో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయాలతో పాటు చెన్నూర్, నిజమాబాద్ రూరల్, పాలకుర్తి, జయశంకర్ భూపాలపల్లి, వైరా, కొత్తకోట, మక్తల్, కొడంగల్, ఆలేరు, ఖానాపూర్, మోత్కూరు, జడ్చర్లలో నూతన బిల్డింగ్లు నిర్మించనున్నారు.