కొత్త రూల్.. రెండు పూటలా ఉపాధిహామీ కూలీల ఫొటోలు తీయాలి

కొత్త రూల్.. రెండు పూటలా ఉపాధిహామీ కూలీల ఫొటోలు తీయాలి
  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ    
  •  ఒక ఫొటో తీస్తే సగం కూలి మాత్రమే వస్తుందని స్పష్టం చేసిన కేంద్రం
  •  ఫొటోలను అన్ని స్థాయిల్లో శాంపిల్‌‌‌‌గా వెరిఫై చేయాలని ఆదేశాలు
  •  పంచాయతీ సెక్రటరీ నుంచి కమిషనర్‌‌‌‌ వరకు బాధ్యతలు
  •  నేటి నుంచే అమల్లోకి రానున్న కొత్త విధానం

కరీంనగర్, వెలుగు : ఉపాధిహామీ కూలీల హాజరులో అవకతవకలకు చెక్‌‌‌‌ పెట్టేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టంది. ఇందులో భాగంగా ఉపాధి పని చేసేందుకు వచ్చిన కూలీల ఫొటోలను రెండు పూటలా తీయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక పూట మాత్రమే ఫొటో తీస్తే.. సదరు కూలీలకు దానికి సంబంధించిన కూలీ మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. 

అంతేగాక ఎన్‌‌‌‌ఎంఎంఎస్‌‌‌‌ యాప్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేస్తున్న ఫొటోలను పంచాయతీ సెక్రటరీలు మొదలుకొని రాష్ట్ర స్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌‌‌‌ వరకు వెరిఫై చేయాలని, ఈ ప్రక్రియ నిత్యం కొనసాగాలని పేర్కొంది. ఈ కొత్త విధానం సోమవారం నుంచే అమల్లోకి రానుంది.

ముఖ్యమైన అంశాలివే...

ఫొటోల వెరిఫికేషన్‌‌‌‌ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రం సూచించింది. మేట్‌‌‌‌ గానీ ఫీల్డ్ అసిస్టెంట్‌‌‌‌ గానీ సంబంధం లేని ఫొటోని అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశారా ? పని ప్రదేశంలో లైవ్ ఫొటో కాకుండా పాత ఫొటోను అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేశారా ? ఫొటోలో ఉన్న వ్యక్తుల సంఖ్య, మస్టర్‌‌‌‌లో హాజరైన వ్యక్తుల సంఖ్యలో తేడా ఉందా ? అన్న వివరాలు గమనించాలని సూచించింది.

 అలాగే ఫొటోల్లో ఉన్న స్త్రీ పురుషుల సంఖ్య, మస్టర్‌‌‌‌లో హాజరైన స్త్రీ పురుషుల సంఖ్యతో సమానంగా ఉందా ? వేర్వేరు మస్టర్‌‌‌‌లలో ఒకే వ్యక్తులను క్యాప్చర్‌‌‌‌ చేశారా ? పొద్దున తీసిన ఫొటోల్లో ఉన్న వ్యక్తులే, మధ్యాహ్నం తీసిన ఫొటోల్లో ఉన్నారా లేక మారారా ? మధ్యాహ్నం ఫొటో క్యాప్చర్ చేశారా.. లేదా ? అనే వివరాలను వెరిఫై చేయాలని కేంద్రం ఆదేశించింది.

విలేజ్‌‌‌‌ సెక్రటరీ నుంచి కమిషనర్‌‌‌‌ వరకు వెరిఫికేషన్‌‌‌‌ బాధ్యతలు

ఎన్ఎంఎంఎస్‌‌‌‌ యాప్‌‌‌‌లో మేట్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసిన ఉపాధి కూలీల అటెండెన్స్ ఫొటోలన్నింటినీ ప్రతి రోజు పంచాయతీ సెక్రటరీలు వెరిఫై చేసి రిపోర్ట్‌‌‌‌ను ఎంపీడీవోకు పంపించాలి. మండల స్థాయిలో అన్ని గ్రామాల నుంచి ఒక రోజులో వచ్చిన మొత్తం ఫొటోల్లో కనీసం 20 శాతం ఫొటోలు లేదంటే గ్రామానికి రెండు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫొటోల చొప్పున ఎంపీడీవో ఆఫీసులోని ఏపీఓ, కాంట్రాక్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌, పర్మినెంట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ అదే రోజు వెరిఫై చేసి.. రిపోర్టును కలెక్టర్, డీఆర్డీఏకు పంపించాలి. 

జిల్లా స్థాయిలో ముందు రోజు క్యాప్చర్ చేసిన ఫొటోల్లో కనీసం 30 ఫొటోలను కలెక్టర్ వెరిఫై చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. డీఆర్డీఏ కాంట్రాక్ట్, పర్మినెంట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ ఒక్కొక్కరు జిల్లావ్యాప్తంగా వచ్చిన మొత్తం ఫొటోల్లో రోజుకు 10 శాతం లేదా 200 ఫొటోలను వెరిఫై చేయాలి. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌‌‌‌ రోజుకు 20 ఫొటోలను వెరిఫై చేయాలని సూచించింది. కమిషనరేట్‌‌‌‌లో పనిచేసే కాంట్రాక్ట్, పర్మినెంట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ ఒక్కొక్కరు 100 ఫొటోలు లేదా రాష్ట్రవ్యాప్తంగా ముందు రోజు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ అయిన వాటిలో ఐదు శాతం ఫొటోలను వెరిఫై చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఏడాదిపాటు ఫొటోల స్టోరేజీ

ఎన్ఎంఎంఎస్‌‌‌‌ యాప్‌‌‌‌లో ప్రస్తుతం తీసిన ఫొటోలు 15 రోజులు మాత్రమే సేవ్‌‌‌‌ అవుతున్నాయి. ఇక నుంచి ఉపాధి హామీ కూలీల ఫొటోలు, మస్టర్‌‌‌‌ వివరాలను సోషల్ ఆడిట్ పూర్తయ్యే వరకు అంటే ఒక సంవత్సరం పాటు స్టోర్‌‌‌‌ చేయాలని కేంద్రం ఆదేశించింది. 

ఫొటోల స్టోరేజీ కోసం ఒక్కో మండలానికి వన్‌‌‌‌ టీబీ కెపాసిటీ గల హార్డ్ డిస్క్‌‌‌‌ను కొనుగోలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా... ఒక్కొక్కరం నాలుగైదు గ్రామాల బాధ్యతలు చూస్తున్నామని, ఉదయం, మధ్యాహ్నం పని ప్రదేశాలకు వెళ్లి ఫొటోలు తీసుకురావడం వ్యయ, ప్రయాసలతో కూడిన పని అని ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.