మళ్లీ కరోనా కలకలం.. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు

మళ్లీ కరోనా కలకలం.. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు

న్యూఢిల్లీ: పోయిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల్లో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెలలో ఇప్పటి వరకు 23 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. అలాగే నోయిడాలో 1, ఘజియాబాద్‎లో 4 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హాస్పిటల్స్‎లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 

బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఢిల్లీ హెల్త్  మినిస్టర్ పంకజ్ సింగ్  సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తాజా కేసులు కామన్ ఇన్ ఫ్లుయెంజా లాంటివని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా మరణాలు సంభవించకపోయినా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక దేశంలోనే అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఈ నెలలో అత్యధికంగా 273 కేసులు వెలుగులోకి వచ్చాయి.

దీంతో కేరళ సర్కారు అప్రమత్తమైంది. సర్వైలెన్స్‎ను పెంచాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి ఆమె పేర్కొన్నారు. కర్నాటకలోనూ ఈనెలలో ఇప్పటిదాకా 35 కరోనా ఇన్ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయి. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్ నెస్ (ఎస్ఏఆర్ఐ) లక్షణాలతో బాధపడుతున్న వారు కరోనా టెస్టు చేయించుకోవాలని కర్నాటక ప్రభుత్వం సూచించింది.

ముంబైలో 95, ఠాణేలో 10

మహారాష్ట్రలో ఈ నెలలో మొత్తం 105 కరోనా కేసులు రిజిస్టర్  అయ్యాయి. ఒక్క ముంబైలోనే 95 కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, 16 మంది రోగులు మాత్రమే హాస్పిటల్స్‎లో చేరారని అధికారులు తెలిపారు. ఎస్ఏఆర్ఐ లక్షణాలతో బాధపడుతున్న వారందరూ కొవిడ్  టెస్టు చేయించుకోవాలని బృహన్ ముంబై కార్పొరేషన్ సూచించింది. ఠాణేలోనూ 10 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా కేసులు విజృంభిస్తున్న సింగపూర్, హాంగ్ కాంగ్ వంటి ఏషియా దేశాల నుంచి ఇండియాకు తిరిగివస్తున్న వారు టెస్టులు చేయించుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.