తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీలో కొత్త కోర్సులు..

తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీలో కొత్త కోర్సులు..
  • నాలుగు కంప్యూటర్ సైన్స్ ..కోర్సులతో ప్రారంభం
  • ఉత్తర్వులు జారీచేసిన సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరైంది. నిజామాబాద్​లోని తెలంగాణ యూనివర్సిటీకి అనుబంధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కాలేజీ ఈ విద్యాసంవత్సరం 2025–26 నుంచే ప్రారంభించనున్నట్లు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా గురువారం జీవో నంబర్ 32 జారీ చేశారు. 

తెలంగాణ వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో కొత్తగా నాలుగు కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతించారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్​ఈ), కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్,  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్ అండ్ ఐటీ), డేటా సైన్స్ తదితర కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లు మంజూరు చేశారు.  నిజామాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజుల క్రితమే పర్మిషన్ ఇచ్చినా.. కొన్ని కారణాల వల్ల పర్మిషన్ ఆలస్యమైంది. ఇప్పటికే ఎప్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగియగా, ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్​ద్వారా ఈ  కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. 

5 నుంచి ఎప్​సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

ఈ నెల 5 నుంచి ఎప్ సెట్ ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. ఆగస్టు 5న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు స్లాట్ బుకింగ్ ఉంటుంది. 6న సర్టిఫికెట్​ వెరిఫికేషన్ తో పాటు 6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 10లోగా సీట్ల అలాట్​మెంట్ ఉంటుంది.