రెవెన్యూ ఉద్యోగులకు కొత్త శాఖ కొత్త డెజిగ్నేషన్లు

రెవెన్యూ ఉద్యోగులకు కొత్త శాఖ కొత్త డెజిగ్నేషన్లు
  • ఇతర శాఖల్లో రెవెన్యూ ఉద్యోగుల విలీనంపై కసరత్తు ముమ్మరం
  • వీఆర్‌ఏ నుంచి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వరకు పేర్ల మార్పు
  • రెవెన్యూ శాఖ సిబ్బంది లెక్కలు తీస్తున్న సీసీఎల్‌ఏ
  • డిప్యూటీ తహసీల్దార్ నుంచి కిందిస్థాయి వాళ్లు పీఆర్‌,వ్యవసాయ శాఖల పరిధిలోకి..
  • సర్టిఫికెట్ల జారీ బాధ్యతలోకల్ బాడీస్ కు?

శాఖల్లో విలీనం చేసే దిశగా ప్రభుత్వం యాక్షన్​ ప్లాన్​ను ముమ్మరం చేసింది. ఇప్పటికే కొత్త చట్టంపై కసరత్తు పూర్తిచేసిన ఉన్నతాధికారులు.. తాజాగా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కొన్నాళ్లుగా రెవెన్యూ ఉద్యోగులపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఆ శాఖను ప్రక్షాళన చేస్తామని, కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. సీఎం సూచనల మేరకు ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. నూతన చట్టంతో కొత్తగా ఉనికిలోకి రాబోతున్న అధికార యంత్రాంగంలోకి ఏయే శాఖల అధికారులను తీసుకోవాలి, టైటిల్‌‌ డీడ్‌‌ జారీ అధికారం ఎవరికి అప్పగించాలి, ఆ విభాగంలో విధులు నిర్వర్తించేందుకు ఏయే శాఖలకు చెందిన సిబ్బందిని నియమించాలన్న దానిపై వారు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలిసింది. ఈ ముసాయిదా కేబినెట్‌‌ ముందుకు వెళ్లే వరకు కూడా అందులోని అంశాలను అత్యంత గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు.

సీసీఎల్ఏ ఆదేశాలతో..

రెవెన్యూ శాఖలో ప్రస్తుతం గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌‌ఏ, వీఆర్వో మొదలు జిల్లాస్థాయి అధికారి అయిన డీఆర్వో (డిస్ట్రిక్ట్​ రెవెన్యూ ఆఫీసర్) వరకు అందరినీ పంచాయతీరాజ్‌‌, మున్సిపల్‌‌, వ్యవసాయ శాఖల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే రెవెన్యూ ఉద్యోగుల వివరాలను తెప్పించుకుంటున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పనిచేస్తున్న 5,088 మంది వీఆర్వోలు, 24,035 వీఆర్‌‌ఏల సమాచారంతోపాటు ఖాళీల వివరాలను నాలుగు నిర్దిష్ట ఫార్మాట్లలో పంపించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను సీసీఎల్‌‌ఏ రెండు రోజుల కింద ఆదేశించారు. కలెక్టర్లకు పంపిన ఫార్మాట్‌‌లో వీఆర్వో, వీఆర్‌‌ఏ పేరు, పనిచేస్తున్న జిల్లా, మండలం, ఎంప్లాయ్‌‌ కోడ్‌‌, ఉద్యోగంలో చేరిన తేదీ, రిక్రూటైన పద్ధతి, పొందుతున్న వేతనం తదితర కాలమ్స్​ ఉన్నాయి. వివరాలు సేకరించాక వారందరినీ పంచాయతీరాజ్‌‌ శాఖకు బదిలీ చేయడంతోపాటు చేయాల్సిన పనినిబట్టి వారి ఉద్యోగానికి కొత్త పేరును ఖరారు చేయనున్నట్టు తెలిసింది. రెవెన్యూ ఇన్‌‌స్పెక్టర్‌‌ (ఆర్‌‌ఐ), రెవెన్యూ డివిజనల్‌‌ ఆఫీసర్‌‌ (ఆర్డీవో), జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పేర్లను కూడా మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. దీంతో వీఆర్వో, వీఆర్‌‌ఏలు ఆందోళనకు గురవుతున్నారు. తమను ఏ శాఖకు పంపుతారో, ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుందో, ప్రమోషన్‌‌ చానల్‌‌ పరిస్థితి ఏమిటోనన్న చర్చలు జరుగుతున్నాయి.

సర్టిఫికెట్ల బాధ్యత ‘లోకల్​ బాడీస్’కు?

ఇప్పటివరకు కులం, ఆదాయం, నివాసం ఇతర సర్టిఫికెట్ల జారీ రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉంది. ఇక మీద ఆ బాధ్యతలను పంచాయతీరాజ్‌‌, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. దాంతోపాటు సర్టిఫికెట్ల జారీలో మరింత పారదర్శకత తెచ్చేలా కొత్త మున్సిపల్‌‌ చట్టంలో నిబంధనలు రూపొందించాలని నిర్ణయించినట్టు సమాచారం.

హోదా మార్పుపై న్యాయసలహా..

ఉద్యోగుల డెసిగ్నేషన్‌‌ మార్పు, ఇతర శాఖల్లో విలీనంతో తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్టు తెలిసింది. వారికి ప్రమోషన్‌‌ చానల్‌‌పై కూడా సర్వీస్‌‌ రూల్స్‌‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల కోడ్‌‌ ముగిశాక జూన్‌‌ మొదటి వారంలో శాఖలు, ఉద్యోగుల విలీనం ప్రక్రియను ఓ కొలిక్కి వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.