
- నేను మరో 10 టికెట్లు ఎక్కువే ఇస్తా
- ప్రతి తల్లీ రెండు మొక్కలు నాటాలె
- టీచర్స్ అటెండెన్స్ బాధ్యత మహిళలకే
- అటవీశాఖ ఆధ్వర్యంలో 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
- వన మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: త్వరలోనే మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోల 50 మంది మహిళలకు ఎమ్మెల్యేలుగా అవకాశం వస్తుందని అన్నారు. తాము మరో పది మందికి అదనంగా టికెట్లు ఇస్తామని చెప్పారు. చట్టసభలో మహిళల సంఖ్య 60 చేరుతుందని అన్నారు. ఇవాళ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వనహోత్సవం కార్యక్రమంలో సీఎం మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మట్లాడుతూ.. వన మహోత్సవం మంచి కార్యక్రమమని అన్నానరు. ప్రతి తల్లీ రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అమ్మ ఒడిలోంచి ఏది ఇచ్చినా దానికి రక్షణ ఉంటుందని సీఎం అన్నారు.
ఇంట్లో పిల్లలను పెంచడంలో నైపుణ్యం ఉన్న మహిళలు పెరట్లో ప్రతి ఏటా రెండు మొక్కలు నాటితే వాటికి సంపూర్ణంగా రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. బడిలో పిల్లల అటెండన్స్ తీసుకునే బాధ్యత టీచర్లకు ఉంటే, టీచర్ల అటెండెన్స్ తీసుకునే పనిని మహిళలకు ఇచ్చామని సీఎం చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చెప్పారు. మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి బాధ్యతను అప్పగించామని, దీంతోపాటు వెయ్యి బస్సులను మహిళా సంఘాలకు ఇప్పించి .. వాటిని ఆర్టీసీ హైర్ కు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.
►ALSO READ | కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీళ్ల పంచాది.. బనకచర్ల vs కాళేశ్వరం
15 సంవత్సరాల వయస్సున్న వారు కూడా మహిళా సంఘాల్లో చేరేలా చట్టాలను సవరిస్తామని సీఎం వివరించారు. గత ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసిందని, ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వన మహోత్సవాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. మొక్కలు నాటి వాటిని రక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి. పీసీసీఎఫ్ సువర్ణ, ఇతర అటవీ అధికారులు పాల్గొన్నారు.