డ్రగ్స్‌, సైబర్ నేరాలే పెను సవాల్‌.. బేసిక్‌ పోలీసింగ్ నిర్వహిస్తాం: ‘వీ6 వెలుగు’ఇంటర్వ్యూలో నూతన డీజీపీ శివధర్‌‌ రెడ్డి

డ్రగ్స్‌, సైబర్ నేరాలే పెను సవాల్‌.. బేసిక్‌ పోలీసింగ్ నిర్వహిస్తాం: ‘వీ6 వెలుగు’ఇంటర్వ్యూలో నూతన డీజీపీ శివధర్‌‌ రెడ్డి
  • ప్రజల సహకారంతో ముందుకెళ్తాం
  • సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తం
  • ప్రజలతో స్నేహంగా, నేరగాళ్లతో కఠినంగా వ్యవహరిస్తం
  • ‘వీ6 వెలుగు’ఇంటర్వ్యూలో నూతన డీజీపీ

హైదరాబాద్‌, వెలుగు: డ్రగ్స్‌, సైబర్ నేరాలే అతి పెద్ద సవాల్ అని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పోలీసులతోనే డ్రగ్స్ మహమ్మారి అంతం కాదని, ప్రజల సహకారం అవసరమన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్ సహా బెస్ట్‌ పోలీసింగ్‌కు కృషి చేస్తామని చెప్పారు. అన్ని సందర్భాల్లో టెక్నాలజీ పైనే ఆధారపడకుండా.. ప్రజలకు చేరువగా బేసిక్ పోలీసింగ్ నిర్వహిస్తామని తెలిపారు. సామాన్యుడికి న్యాయం జరిగేలా చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రజలతో స్నేహ పూర్వకంగా.. నేరగాళ్లతో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా నియామకమైన నేపథ్యంలో శనివారం ‘వీ6 వెలుగు’తో శివధర్‌‌ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. తనను డీజీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి తనపై పెట్టిన బాధ్యతలను నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు.

పాలక, ప్రతిపక్షాలు అనే భేదం లేదు..
ఐపీఎస్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత వివిధ హోదాల్లో పని చేశానని శివధర్‌‌ రెడ్డి అన్నారు. పోలీసులకు ప్రతిపక్షం, పాలకపక్షం అనే భేదాలు ఉండవన్నారు. తనది కాంట్రవర్సీలకు దూరంగా ఉండే మనస్థత్వమని తెలిపారు. ఇంటెలిజెన్స్‌ సహా సరిహద్దు జిల్లాల ఎస్పీగా పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. ఆయా విభాగాల్లో క్షేత్రస్థాయి పోలీసింగ్‌పై అవగాహన ఉందని వెల్లడించారు. గతంలో డీజీపీలుగా పనిచేసిన అధికారుల విధివిధానాలకు అనుగుణంగా ముందుకెళ్తానని చెప్పారు. డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది సహా సామాన్య ప్రజలకు అందాల్సిన సేవలు వారికి చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలతో కలిసినప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఇంప్లిమెంట్‌ అవుతున్న ‘క్యూ ఆర్ కోడ్‌ స్కాన్‌’విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. 

ఈగల్ ఫోర్స్, సీఎస్‌బీ మరింత బలోపేతం..
దేశాన్ని డ్రగ్స్‌, సైబర్ నేరాలు పట్టి పీడిస్తున్నాయని, వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని శివధర్ రెడ్డి గుర్తుచేశారు. ఈగల్ ఫోర్స్‌, సైబర్ సెక్యూరిటీ బ్యూరో‌కు దేశంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర పోలీసులసు దేశంలో నంబర్ వన్‌గా నిలుపుతామన్నారు. డ్రగ్స్ నివారణ కోసం ప్రజల నుంచి కూడా సహకారం కావాలని కోరారు. సైబర్ క్రైమ్ సెక్యూరిటీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. సైబర్ నేరాలు దేశంలో పెద్ద సమస్యగా మారిందన్నారు. అలాగే, సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెడతామని, పరిధి దాటితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో మావోయిస్టులు దాదాపు అంతరించి పోయారని, సెంట్రల్ కమిటీ మెంబర్లు సహా కీలక నేతలు లొంగిపోతున్నారని తెలిపారు. 70 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్నారు.