వాట్సప్లో కొత్త అప్ డేట్లు

వాట్సప్లో కొత్త అప్ డేట్లు

ఆండ్రాయిడ్, ఐఓఎస్.. ఫోన్​ ఏదైనా సరే  సోషల్​మీడియా యాప్స్​లో వాట్సాప్ వాడేవాళ్ల సంఖ్య ఎక్కువ. అందుకని యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ అందిస్తుంటుంది వాట్సాప్. త్వరలోనే వాట్సాప్​లో  స్క్రీన్​షాట్ బ్లాకింగ్ ఫీచర్​ రానుంది. యూట్యూబ్​లో వీడియోల్ని హై రెజల్యూషన్​లో చూడాలంటే సబ్​స్క్రిప్షన్ ఉండాల్సిందే.  అంతేకాదు 20 వేలలోపు కూడా మంచి కంపెనీ 5జీ ఫోన్లు దొరుకుతున్నాయి. ఇవి ఈవారం టెక్నాలజీ అప్​డేట్స్​లో కొన్ని. వీటి గురించి మరింత తెలుసుకోవాలి అనుకుంటున్నారా! అయితే ఇది చదవండి..

వాట్సాప్​లో ఎవరిదైనా స్టేటస్  నచ్చిందంటే వెంటనే  స్క్రీన్​షాట్ తీసుకుంటారు కొందరు. అట్లనే అవతలివాళ్లు పంపిన ఫొటోలు, టెక్స్ట్​ మెసేజ్​లు బాగుంటే చాలు  స్క్రీన్​షాట్ తీసి స్టేటస్​గా పెట్టుకుంటారు. పోయిన ఏడాది ఒకసారి మాత్రమే చూడ్డానికి వీలుండే  ‘వ్యూ వన్స్’ ఫీచర్​ తెచ్చింది వాట్సాప్. ఈ మెసేజ్​లు, ఫొటోలు, వీడియోలు అవతలివాళ్లు చూసిన వెంటనే ఆటోమెటిక్​గా డిలీట్ అవుతాయి.  కానీ, వాటిని స్క్రీన్​షాట్ తీసుకునే అవకాశం ఉండేది. దాంతో ఈ సమస్యకు పరిష్కారంగా త్వరలోనే ‘స్క్రీన్​షాట్ బ్లాకింగ్’ ఫీచర్​ తేనుంది వాట్సాప్. ఈ ఫీచర్​ వస్తే.... ‘వ్యూ వన్స్’ ఫొటోలు, మెసేజ్​లని  స్క్రీన్ షాట్ తీయడం కుదరదు. వీడియోల్ని స్క్రీన్ రికార్డ్ చేయడం సాధ్యంకాదు. ఒకవేళ వాటిని స్క్రీన్​షాట్ తీయాలని ప్రయత్నిస్తే   బ్లాక్​ అయినట్టు చూపిస్తుంది. ఈ ఫీచర్​ని వాట్సాప్ బీటా 2.22.21.71 వెర్షన్​లో టెస్ట్​ చేస్తున్నారు. 

పోల్ ఆప్షన్
వాట్సాప్​లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్.. ఇలా చాలా గ్రూప్​లు ఉంటాయి. వాటిలో ఏదో ఒక విషయం గురించి చర్చ​ నడుస్తూనే ఉంటుంది. గ్రూప్​లో పెట్టిన ఒక విషయం ఎంతమందికి నచ్చింది? ఎక్కువమంది అభిప్రాయం ఏంటి? అనేది తెలుసుకోవడం ఇకపై చాలా ఈజీ. ​ త్వరలోనే ‘పోల్ ఆప్షన్’ అనే ఫీచర్ తీసుకురానుంది వాట్సాప్. ఇది ట్విట్టర్​లో ఉన్న  ‘పోల్ ఆప్షన్’ ​ ఫీచర్​లాంటిదే.   దీంతో ఏ విషయం మీద అయినా ఓటింగ్ పెట్టొచ్చు.  వచ్చిన ఓట్లను బట్టి  ఏది బెస్ట్​ అనేది తేల్చడం సులువు అవుతుంది. ఈ ఫీచర్​లో... స్క్రీన్​మీద  క్రియేట్ పోల్ ఆప్షన్ కనిపిస్తుంది.  ఇందులో12 ఆప్షన్లు ఉంటాయి. గ్రూప్​లోని వాళ్లు ఈ ఆప్షన్లని పైకి, కిందకు జరపొచ్చు.