కొత్త గైడ్ లైన్స్.. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేయొద్దు

కొత్త గైడ్ లైన్స్.. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేయొద్దు
  • కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేయొద్దు
  • కొవిడ్ ప్రొటోకాల్ నుంచి తొలగించిన కేంద్రం 
  • కొత్త గైడ్ లైన్స్ విడుదల 

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ లో ఇకపై ప్లాస్మా థెరపీని ఉపయోగించవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్ ప్రొటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ట్రీట్ మెంట్ కు ఎయిమ్స్, ఐసీఎంఆర్, నేషనల్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా రూపొందించిన కొత్త గైడ్‌లైన్స్ ను సోమవారం విడుదల చేసింది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నవాళ్లను మాత్రమే హోం ఐసోలేషన్ లో ఉంచాలని, మోడరేట్ కేసులను వార్డులో, సీరియస్ కేసులను ఐసీయూలో చేర్చాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. శ్వాసలో ఇబ్బందిలేకుంటే మైల్డ్ కేసులుగానే పరిగణించాలని కేంద్రం తెలిపింది. నిమిషానికి 24 సార్ల కంటే ఎక్కువగా శ్వాస తీసుకోవడం (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది), ఆక్సిజన్ శాతం 93కు దిగువన, 90కి ఎగువన ఉంటే మోడరేట్ కేసుగా భావించాలని పేర్కొంది. నిమిషానికి 30 సార్ల కంటే ఎక్కువగా శ్వాసతీసుకోవడం (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది), ఆక్సిజన్ స్థాయి 90 శాతం కంటే తక్కువ ఉంటే సీరియస్ కేసుగా పరిగణించాలని తెలిపింది. మోడరేట్, సీరియస్ కేసులకు మాత్రమే 'రెమ్‌డెసివిర్' వాడాలని, సీరియస్ కేసుల్లో (ఆఫ్ లేబుల్) 'టాసిలిజుమాబ్' (కేసు తీవ్రత పెరిగిన 24 – -48 గంటల్లోగా) వినియోగం ప్రయత్నించాలని కేంద్రం వివరించింది.