
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రపై ఎమ్మెల్సీ సిరికొండ వర్గీయుల గుస్సా
- హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకున్న మధుసూదనాచారి ఫాలోవర్స్
- చారి సాబ్’ కే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానానికి అల్టిమేటం
- గులాబీ బాస్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరో తలనొప్పి
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: బీఆర్‌ఎస్ పార్టీ హైకమాండ్‌కు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ లొల్లి జరుగుతుంటే మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ విషయం కూడా రచ్చకెక్కింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గండ్రకు టికెట్ ఇస్తే 150 మంది తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ లీడర్లు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
గండ్రకు ఇంటిపోరు
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత బీఆర్‌ఎస్ లో చేరిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సొంత పార్టీలోనే ఇంటిపోరు మొదలైంది. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఈ సారి ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేరిన గండ్రకు పాతతరం బీఆర్‌ఎస్ లీడర్ల మద్దతు లేకుండా పోయింది. గతంలో తన వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన వెంట ఉన్నారు. ఎమ్మెల్యే గండ్ర అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇటు తెలంగాణ ఉద్యమకారులు వర్సెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వ్యవహారం తయారైంది. పార్టీలోకి వలస వచ్చిన వారు తమపై పెత్తనం చెలాయించడం ఏంటని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరికొండ వైపే ఉద్యమకారులు
నియోజకవర్గంలో ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ తొలితరం లీడర్లంతా సిరికొండ మధుసూదనాచారి వైపే ఉన్నారు. కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సర్వేలో ప్రజలు మధుసూదనాచారి వైపే మొగ్గు చూపుతుండడంతో ఆయనపై బురద జల్లేందుకు ఎమ్మెల్యే గండ్ర అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజంలా పనిచేసి రాష్ట్రాన్ని సాధించే వరకు ప్రజలలో ఉద్యమ చైతన్యం రగిలించిన మధుసూదనాచారికి పార్టీ ద్రోహం చేయకూడదని కోరుతున్నారు. చారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని, గండ్రకు టికెట్ ఇస్తే మాత్రం ఓడించడం తథ్యమని అంటున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని జిల్లాలో చర్చ జరుగుతోంది.