చేతికొచ్చే జీతం తగ్గుతుంది.. PF బెనిఫిట్స్ పెరుగుతాయి.. కొత్త చట్టం ఏం చెబుతోంది..?

చేతికొచ్చే జీతం తగ్గుతుంది.. PF బెనిఫిట్స్ పెరుగుతాయి.. కొత్త చట్టం ఏం చెబుతోంది..?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త కార్మిక సంస్కరణలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది వేతనజీవుల జీవితాలను ప్రభావితం చేయనున్నాయి. ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం శ్రామిక వర్గానికి మెరుగైన సామాజిక భద్రత కల్పించడం. ఈ మార్పులపై అందరికీ ఉన్న ఓ పెద్ద ప్రశ్న ఏమిటంటే: నెలవారీ 'టేక్-హోమ్' జీతం నిజంగా తగ్గుతుందా? అన్నదే. దీనికి జవాబు చాలా మంది ఉద్యోగులకు కాస్త నిరాశ కలిగించేదే. చేతికొచ్చే జీతం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

'బేసిక్' మార్పుతో కోత తప్పదా..?
ప్రస్తుతం అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు PF, గ్రాట్యుటీ వాటాలను తగ్గించుకోవడానికి తెలివిగా ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అదేమిటంటే.. బేసిక్ జీతాన్ని చాలా తక్కువగా ఉంచటం. ఇంటి అద్దె, ఇతర అలవెన్సుల రూపంలో ఎక్కువ డబ్బు చెల్లించడం. ఎందుకంటే.. PF, గ్రాట్యుటీ వంటివి బేసిక్ జీతంపై మాత్రమే లెక్కించాలి కాబట్టి.

కానీ.. కొత్త లేబర్ కోడ్స్ ఇలాంటి వాటికి కళ్లెం వేయబోతున్నాయి. మారిన రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి సీటీసీలో కనీసం 50% బేసిక్ పే, డీఏ రూపంలో ఉండాల్సిందే. ఇది కచ్చితంగా అమలు చేయాల్సిన నిబంధన. దీనివల్ల బేసిక్ జీతం పెంచడం కంపెనీలకు తప్పనిసరి అవుతుంది. బేసిక్ పెరిగితే.. దానిపై లెక్కించే PF (12%), గ్రాట్యుటీ వాటా కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. పెరిగిన ఈ వాటా మీ నెలవారీ జీతం నుంచే కట్ అవుతుంది కాబట్టి చివరికి చేతికి అందే మెుత్తం తగ్గుతుందన్నమాట.

ఉదాహరణకు.. ఒక ఉద్యోగి వార్షిక PF కాంట్రిబ్యూషన్ రూ.42వేల నుంచి రూ.60వేలకు పెరిగితే.. నెలకు రూ.1,500 అదనంగా జీతంలో కట్టింగ్స్ పెరుగుతాయి. అంటే మీ CTC స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రతి నెలా చేతికి వచ్చే డబ్బు రూ.15వందలు తగ్గిపోతుందన్నమాట. 

భవిష్యత్తు భద్రం..
కట్టింగ్స్ పెరగటంపై నిరాశ చెందాల్సిన పనిలేదు. ఇది ఒక రకంగా బలవంతపు పొదుపు లాంటిది. మీ టేక్-హోమ్ జీతం తగ్గినప్పటికీ.. ఆ డబ్బు మీ పేరు మీద PF ఖాతాలో జమ అవుతుంది. సురక్షితమైన రాబడిని ఇస్తుంది. దీని వలన మీరు పదవీ విరమణ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ డబ్బు అందుకోగలరు.