నాగోబా ఆలయానికి కొత్త కళ

నాగోబా ఆలయానికి కొత్త కళ

ఆదిలాబాద్, వెలుగు : ఆదివాసీల ఆరాధ్య దైవం కొలువుదీరిన నాగోబా ఆలయానికి కొత్త కళ వచ్చింది. ఈ చారిత్రక ఆలయానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. సమ్మక్క సారక్క జాతర తర్వాత అతి పెద్ద గిరిజన జాతరగా నాగోబా గుర్తింపు పొందింది. నాగోబా పూజా పురస్కారాలు నిర్వహించే మెస్రం వంశీయుల ఆచారాల వ్యవహారాలు మిగిలిన గిరిజనులకు భిన్నంగా ఉంటాయి. ఏటా పుష్యమాస అమావాస్య రోజున కేస్లాపూర్​లో ప్రారంభమయ్యే నాగోబా జాతరకు రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, ఒడిశా, చత్తీస్​గఢ్​, జార్ఖండ్​ రాష్ట్రాల నుంచి వివిధ తెగలకు చెందిన ఆదివాసీలు హాజరవుతారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్​లో 1956లో మొదటిసారి నాగోబాకు గుడిసెను ఏర్పాటు చేయగా, 1995లో రాతితో ఆలయాన్ని నిర్మించారు. దాని స్థానంలో కొత్త ఆలయం కోసం 2017లోనే  మెస్రం వంశీయులు ఏకంగా రూ. 5 కోట్లు జమ చేసి, నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాగోబా ఆలయంతో పాటు సతీదేవత ఆలయ నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పటివకే ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభం కాగా, ఈ నెల 18 వరకు పూజ కార్యక్రమాలు కొనసాగించి, చివరి రోజు  నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఆదివాసీలు తరలివస్తున్నారు. 

ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణం

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించిన గ్రానైట్ రాళ్లపై నాగోబా చరిత్ర, ఆదివాసీల దేవతమూర్తుల శిల్పాలను సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా చెక్కారు. ఆలయం ముఖద్వారంలో ఏడు పడగల నాగోబా ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెస్రం వంశీయుల చరిత్ర తెలిసేలా శిల్పాలు, ఆచారాలు, పూజ విధానం ఇలా అన్నీ శిల్పాలపై కనిపిస్తున్నాయి. అప్పటి గోండ్వానా రాజ్యం చిహ్నాలు దర్శనమిస్తున్నాయి. చరిత్రలో ఈ ప్రాంతమంతా ఒకప్పుడు గోండ్వానా రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ సమయంలో చిన్న గుడిసెలో నాగోబా దేవుడు పూజలు అందుకున్నట్లు పెద్దలు చెబుతారు.