
హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడ న్యూ మధురానగర్ కాలనీవాసులు బిక్షాటన చేపట్టారు. కాలనీలో ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ఆందోళన చేశారు. గత 10 సంవత్సరాల క్రితమే న్యూ మధురానగర్ కాలనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించామని.. ఇప్పుడు ఇంద్రహిల్స్ పేరు పెడితేనే డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని స్థానిక కార్పొరేటర్ దీపికా శేఖర్ రెడ్డి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని.. కంపు కొడుతోందని కాలనీవాసులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయించాలన్న ఆలోచన కూడా స్థానిక కార్పొరేటర్‌కు లేదని మండిపడుతున్నారు.
న్యూ మధురానగర్ కాలనీ బోర్డు పక్కనే స్థానిక బీఆర్ఎస్ నేతలు ఇంద్రహిల్స్ పేరుతో మరో బోర్డు ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిని పక్కనపెట్టి పేర్ల కోసం పోటీ పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ విఫలమయ్యారని ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని తమ సమస్య పరిష్కరించాలని కోరారు.