భార్యను అత్తగారింట్లో దింపొస్తుండగా యాక్సిడెంట్​

భార్యను అత్తగారింట్లో దింపొస్తుండగా యాక్సిడెంట్​

కళ్ల ముందే అక్క మృతి

ఎయిర్​బెలూన్లు తెరుచుకోవడంతో భర్త సేఫ్

శంషాబాద్, వెలుగు: ఆషాడ మాసమని భార్యను అత్తవారింట్లో దింపి కారులో తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా ఇంకొకరు గాయపడ్డారు. శంషాబాద్ మండలంలోని ఎయిర్ పోర్టు కాలనీ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హఫీజ్ పేటకి చెందిన రోహిత్(23)కు ఇటీవల వివాహమైంది. ఆషాడమాసం రావడంతో తన తల్లి అరుణ(46 )తో కలిసి కారులో భార్యను అత్తవారింటికి దగ్గర దిగబెట్టాడు. తిరుగు ప్రయాణంలో వనస్థలిపురంలోని తన అక్క దివ్య(26)ను ఎక్కించుకుని అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా హఫీజ్ పేట బయలుదేరారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీ వద్దకు చేరుకునే సమయంలో కారుకు ముందు నెమ్మదిగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టారు. కారు నడుపుతున్న రోహిత్ పక్కనే కూర్చున్న దివ్య ఎగిరి రోడ్డుపై పడింది. తలకు బలమైన గాయమవ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో రోహిత్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతని తల్లి అరుణ(46 )కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు శంషాబాద్ పోలీసులు తెలియజేశారు. అయితే మృతి చెందిన దివ్యకు పెళ్లయి కేవలం పది నెలలేనని, ఇంతలోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.