
- గోదావరి నది ఒడ్డున మరిన్ని బొగ్గు నిక్షేపాల గుర్తింపు
- 250 మీటర్ల లోతులో రెండు పొరలను కొనుగొన్న సింగరేణి
- తొలిసారి ఉత్పత్తి చేపట్టగా, ఉనికిలోకి గోదావరిఖని టౌన్
- తాజాగా గుర్తించిన మైన్ తో మరో పదేండ్లపాటు గని లైఫ్
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గోదావరిఖని టౌన్ పుట్టుకకు కారణమైన తొలి బొగ్గు గనికి మరో పదేండ్ల లైఫ్ పెరగనుంది. గోదావరి నది ఒడ్డున సమ్మక్క జాతర స్థలంలో చేపట్టిన ఎక్స్ప్లోరేషన్ ద్వారా 250 మీటర్ల లోతులో రెండు బొగ్గు పొరలు వెలుగు చూశాయి. ఇక్కడ తొలిసారి 1961లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించగా, గోదావరిఖని ఉనికిలో ఉంది. తాజాగా వెలుగుచూసిన నిక్షేపాలతో మరో పదేండ్ల పాటు బొగ్గు ఉత్పత్తి జరగనుంది.
గోదావరిఖని పుట్టుకకు కారణమిదే..
గోదావరినది తీరంలో బొగ్గు నిక్షేపాలను కనుగొన్న తర్వాత ఇల్లందు, కొత్తగూడెం, బెల్లంపల్లి ఏరియాల్లో మైన్స్ ను సింగరేణి ప్రారంభించింది. అనంతరం1959లో ఉమ్మడి కరీంనగర్జిల్లా రామగుండం మండలం జనగామ శివారులో తొలిసారి బొగ్గు తవ్వకాలు చేపట్టింది. రామగుండం రీజియన్లో తొలిసారిగా జీడీకే -–1 ఇంక్లైన్ గనిలో 23.93 మిలియన్టన్నుల బొగ్గు నిల్వలను గుర్తించింది. 1961 నుంచి 2025 ఏప్రిల్ నెల వరకు 64 ఏండ్లలో 21.27 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసింది. ఇంకా గనిలో 12 ఏండ్ల పాటు తవ్వేందుకు వీలుగా 2.66 మిలియన్టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
కాగా.. మొదట్లో ఇక్కడ బొగ్గుగనిలో పని చేసేందుకు వచ్చిన కార్మికులకు, అధికారులకు క్వార్టర్లు నిర్మించింది. మరికొందరు సొంతంగా ఇండ్లను కట్టుకోగా, అవి కాలనీలుగా మారాయి. ఇలా బొగ్గు గని ఏర్పాటు కావడంతో పాటు సమీపంలోనే గోదావరి నది పారుతుండడంతో ఈ ప్రాంతానికి 'గోదావరి ఖని'(జీడీకే) గా పేరు పెట్టారు. జనగామ శివారులోని బొగ్గు గనిని కూడా జీడీకే– 1 ఇంక్లైన్గా మార్చారు. ఆ తర్వాత గోదావరిఖనితో పాటు యైటింక్లయిన్కాలనీ, సెంటినరీ కాలనీల్లో పలు అండర్ గ్రౌండ్ , ఓపెన్కాస్ట్మైన్స్ లను ఏర్పాటు చేశారు. దీంతో రామగుండం రీజియన్ఏరియా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా మారింది.
తాజాగా రెండు బొగ్గు పొరలు కనుగొనగా..
జీడీకే–1 ఇంక్లైన్గని లైఫ్మరింత పెంచేందుకు సింగరేణి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గోదావరి నది తీరంలో సమ్మక్క జాతర జరిగే స్థలంలో కొద్ది రోజులుగా భూమిలో డ్రిల్లింగ్చేస్తూ.. బొగ్గు నిక్షేపాల అన్వేషణ కొనసాగించింది. గత నెల 22న కొత్తగా బొగ్గు నిక్షేపాలను గుర్తించింది. భూమిలోపల 250 మీటర్ల లోతులో ఐదున్నర మీటర్లు, మూడు మీటర్ల వెడల్పుతో రెండు పొరలను కనుగొన్నారు.
ఇవి ఎంత పొడవునా విస్తరించి ఉన్నాయనే పనిలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. సింగరేణి విస్తరించిన చాలా ఏరియాల్లో ఏర్పాటైన భూగర్భ గనులు కొద్ది రోజులకే మూతపడుతున్నాయి. కానీ గోదావరిఖనిలో తొలిసారి ఏర్పాటైన జీడీకే –1 ఇంక్లైన్ గని మాత్రం మరింత మనుగడ సాగిస్తూ సింగరేణిలోనే చరిత్ర సృష్టించనుంది.