
ఆ అడవిలో ఏం జరుగుతోంది?
- టైటిల్ : నరివెట్ట
- ప్లాట్ ఫాం : సోనీలివ్
- డైరెక్షన్ : అనురాజ్ మనోహర్
- కాస్ట్ : టొవినో థామస్, సూరజ్ వెంజరమూడి, చేరన్, ఆర్య సలీమ్, ప్రణవ్, ప్రియంవద కృష్ణన్
వర్గీస్ పీటర్ (టొవినోథామస్) తల్లి టైలరింగ్ చేస్తూ అతన్ని చదివిస్తుంది. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధాంచాలని ప్రయత్నాలు చేస్తుంటాడు వర్గీస్. చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా.. చేరడానికి ఇష్టపడడు. తల్లికి వయసు మీదపడడంతో ఏదైనా ఉద్యోగం చూసుకోమని వర్గీస్‌కు పదే పదే చెప్తుంటుంది. పైగా అతను ప్రేమించిన నాన్సీ (ప్రియంవద కృష్ణన్) తండ్రి కూడా కూతురుని ఉద్యోగం ఉన్నవాడికే ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్తాడు.
దాంతో వర్గీస్‌కు ఇష్టం లేకపోయినా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు. అక్కడే అతడికి హెడ్ కానిస్టేబుల్ బషీర్ (సూరజ్ వెంజరమూడి) పరిచయం అవుతాడు. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడుతుంది. అదే టైంలో వర్గీస్, బషీర్ తమ టీంతో కలిసి గిరిజనులు వయనాడ్ అడవిలో ఇళ్ల కోసం ఉద్యమం చేస్తున్న ప్లేస్‌కి బందోబస్తుకు వెళ్తారు. ఆ అల్లర్లలో బషీర్ చనిపోతాడు. తర్వాత ఏం జరిగింది? అతని చావుకు కారణం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
ఇద్దరూ ఒక్కటయ్యారా?
- టైటిల్ : ఆప్ జైసా కోయి
- ప్లాట్ ఫాం: నెట్‌ఫ్లిక్స్
- డైరెక్షన్ : వివేక్ సోని
- కాస్ట్ : ఆర్ మాధవన్, ఫాతిమా సనా షేక్, అయేషా రజా, మనీష్ చౌదరి, నమిత్ దాస్
సంప్రదాయ కుటుంబానికి చెందిన శ్రీరేణు (ఆర్ మాధవన్)కు 40 ఏండ్లు వచ్చినా పెండ్లి జరగదు. అతను సంస్కృత ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. అలాంటిది తన ఫ్రెండ్ (నమిత్ దాస్) ఒత్తిడి చేయడంతో ఒక రొమాంటిక్ చాటింగ్ యాప్ వాడడం అలవాటు చేసుకుంటాడు. అదే టైంలో అతనికి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మోడర్న్ లేడీ, ఫ్రెంచ్ ప్రొఫెసర్ మధు ( ఫాతిమా సనా షేక్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లో వాళ్ల బంధం ప్రేమగా మారుతుంది. నిశ్చితార్థం చేసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. కానీ.. అప్పటినుంచి శ్రీరేణు మధుని చూసే విధానంలో ఏదో మార్పు వస్తుంది. తరువాత ఏం జరిగింది? ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అనేదే మిగతా కథ.
అంబేద్కర్ బాటలో
- టైటిల్ : కార్కి
- ప్లాట్ ఫాం : సన్‌నెక్స్ట్
- డైరెక్షన్ : పవిత్రన్
- కాస్ట్ : జై ప్రకాష్, మీనాక్షి దినేష్,
- సాధు కోకిల బాల రాజవాడి
తమిళ చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’ ఇన్‌స్పిరేషన్‌తో కన్నడలో ‘కార్కి’ సినిమాని తీశారు. ఈ కథ ముత్తు అలియాస్ ముత్తతి ముత్తురాజ్ (జై ప్రకాష్) చుట్టూ తిరుగుతుంది. అతను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కుర్రాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను ఆరాధిస్తాడు. అణగారిన వర్గాలకు గొంతుకగా మారాలనే ఉద్దేశంతో ఎల్‌ఎల్‌బి చదవాలని కలలు కంటాడు. చివరకు సిటీలోని ఒక లా కాలేజీలో సీటు సంపాదిస్తాడు.
అక్కడే అతనికి బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన జ్యోతి లక్ష్మి అలియాస్ జో (మీనాక్షి)తో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ల మధ్య ఉన్న సామాజిక వ్యత్యాసాలను తెలుసుకోకుండా ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఒకసారి ముత్తుని జో తన అక్క పెండ్లికి ఆహ్వానిస్తుంది. అక్కడికి వెళ్లిన ముత్తుకి ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? జో తండ్రి ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాలి.