
అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, గెలల దిగుబడి దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట లో కొత్తగా ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేస్తానని ఆయిల్ ఫ్యాక్టరీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన దమ్మపేట మండలం అప్పారావుపేట, అశ్వారావుపేట మండలం నారం వారి గూడెం ఆయిల్ పామ్ నర్సరీని, ఫ్యాక్టరీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా అప్పారావుపేట ఫ్యాక్టరీని పరిశీలించి ఉద్యోగులు, సిబ్బందితో రివ్యూ చేశారు. అనంతరం అశ్వారావుపేట ఫ్యాక్టరీలో గెలల క్రషింగ్ పవర్ ప్లాంట్ ను తనిఖీ చేసి వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి తుమ్మల హామీ ప్రకారం ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో కొత్తగా పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోందని, ఇది జూన్ నాటికి సిద్ధం చేస్తామన్నారు. సిద్దిపేట ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాగా ట్రైన్ రన్ నిర్వహించి గెలల క్రషింగ్ ను చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో ఈ ఫ్యాక్టరీ సీఎం ప్రారంభిస్తామని వెల్లడించారు.