ఖమ్మం జిల్లాలో కొలువుదీరుతున్న కొత్త పంచాయతీలు

ఖమ్మం జిల్లాలో కొలువుదీరుతున్న కొత్త పంచాయతీలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త పంచాయతీలు కొలువుదీరుతున్నాయి. పంచాయతీల పాలనలో ఆదివాసీ గిరిజనులు సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. జిల్లాలోని చాలా ఏజెన్సీ ప్రాంతాలు ఎస్టీలకు రిజర్వ్ కావడంతో మెజర్టీ స్థానాలు గెలిచి పాలనా పగ్గాలు చేపట్టారు గిరిజనులు. పాలనతో తొలిమెట్టు…సంక్షేమంలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ…పంచాయతీల పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఖమ్మం జిల్లా ఏజెన్సీలు పంచాయతీ పండుగతో సందడిగా మారాయి. గ్రామస్థాయి పాలనా పగ్గాలు జిల్లాలో ఆదివాసీ గిరిజనులకు దక్కాయి. స్థానిక సంస్థల ప్రక్రియలో భాగంగా ఈసారి పంచాయతీల పాలనలో ఆదివాసీ గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు లభించని అత్యధిక పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు జిల్లాలో గిరిజనులకు దక్కాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పేసా చట్టాలకు అనుగుణంగా మెజారిటీ పంచాయితీలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు పాలన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరడంతో… తమ బతుకులు మారుతాయని ఆశిస్తున్నారు ఆదివాసీలు. చాలా కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మండలాలు ఉండగా 479 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 463 పంచాయతీలకు ఆదివాసులు, గిరిజనులే సర్పంచ్ లుగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పూర్తి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మహిళలకు 227, స్త్రీ, పురుషులకు 227 సర్పంచ్ పదవులను రిజర్వు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియ అమల్లో కూడా గిరిజన మహిళలకు 5, గిరిజన స్త్రీ, పురుషులకు 4 సర్పంచ్ పదవులు లభించాయి. షెడ్యూల్డు కులాల వారికి 5, జనరల్ స్థానంలో 11 సర్పంచ్ స్థానాలున్నాయి.

కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లోని పంచాయితీలో సింహ భాగం వార్డు సభ్యులు కూడా గిరిజనులే ఉన్నారు. 479 గ్రామ పంచాయితీలో 4 వేల 232 వార్డులు ఉన్నాయి. వీటిలో 4046 వార్డుల్లో సభ్యులుగా గిరిజన ప్రజా ప్రతినిధులే ఉన్నారు. వార్డుల్లో పూర్తి షెడ్యూల్డు ఏరియాల్లో గిరిజన మహిళలకు  1988 వార్డులు లభించగా.. గిరిజన స్త్రీ, పురుషులకు 1994 వార్డులు రిజర్వ్ అయ్యాయి. వీటితోపాటు గిరిజన రిజర్వేషన్ల ప్రాతిపదికలో మహిళలకు అదనంగా 39 వార్డులు, స్త్రీ పురుషుల కోటాలో 25 వార్డులు దక్కాయి.

జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయితీలు కలిగిన మండలంగా దుమ్ముగూడెం నిలవగా. అతి తక్కువ పంచాయతీలు ఉన్న మండలంగా అన్నపురెడ్డి పల్లి నిలిచింది.