కొత్త పీఆర్సీ..రిటైర్డ్ ఐఏఎస్ ఎన్​.శివశంకర్​ చైర్మన్‌‌గా ఏర్పాటు

కొత్త పీఆర్సీ..రిటైర్డ్ ఐఏఎస్ ఎన్​.శివశంకర్​ చైర్మన్‌‌గా ఏర్పాటు
  • ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఉత్తర్వులు
  • మధ్యంతర భృతి 5 శాతం ప్రకటన
  • అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పీఆర్సీ నివేదిక ఇచ్చే వరకు వర్తింపు

హైదరాబాద్, వెలుగు : కొత్త పే రివిజన్ కమిటీ (పీఆర్‌‌సీ)ని రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్‌‌ అధికారి ఎన్‌‌.శివశంకర్‌‌‌‌ను చైర్మన్‌‌గా, మరో రిటైర్డ్ ఐఏఎస్ బి.రామయ్యను సభ్యుడిగా నియమించింది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అప్పటిదాకా ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌‌) ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఐఆర్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. 2020 పీఆర్సీ వర్తించిన ఉద్యోగులందరికీ ఐఆర్ వర్తిస్తుందని తెలిపింది.

సోమవారం ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన మొదటి పీఆర్సీ కాలం జూన్‌‌ 30తో ముగిసింది. జులై 1 నుంచి రెండో పీఆర్సీ వేతనాలు అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన ఐఆర్‌‌ జులై నెల నుంచి (రెట్రోస్పెక్టివ్‌‌) అమల్లోకి వస్తుందా లేక ప్రకటించిన నెల నుంచి (ప్రాస్పెక్టివ్‌‌) అమల్లోకి వస్తుందా అనే సందేహాలను ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఐఆర్‌‌ను జులై 1 నుంచి అమలయ్యేలా ప్రకటించాలని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం అక్టోబర్ ఒకటో తేదీ నుంచే ఐఆర్ ఉంటుందని స్ఫష్టం చేసింది.

ఎంప్లాయీస్ నారాజ్

ఐఆర్‌‌‌‌ను కనీసం 15 శాతం ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరారు. అయితే దాన్ని 5 శాతానికే పరిమితం చేయడం, పైగా అక్టోబర్ నుంచి అమల్లోకి తీసుకురావడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇంత దానికి ఐఆర్ ప్రకటించడం దేనికని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి మూడు డీఏలు రావాల్సి ఉందని, ఇప్పుడు ఐఆర్‌‌ కూడా తగినంతగా ప్రకటించకపోతే ఎలా అని వాపోతున్నారు. అక్టోబర్ నుంచి అమల్లోకి తీసుకురావడం ద్వారా గతంలో పీఆర్సీ ఫిట్‌‌మెంట్‌‌ విషయంలో మోసపోయినట్లే ఈసారి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం కారణంగా గతంలో ‘21 నెలల ఫిట్‌‌మెంట్‌‌’ అనేది కాగితాలకే పరిమితమైందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2022లో ఒకటి.. ఈ ఏడాది జనవరిలో రెండు, జులైలో మళ్లీ మూడో డీఏను సర్కారు ఇవ్వాల్సి ఉన్నది. 3.64 శాతం చొప్పున మొత్తంగా 10.92 శాతం డీఏ పెండింగ్‌‌లో పడింది. అటు డీఏలు ఇవ్వకుండా.. ఇటు ఐఆర్ పెంచకుండా ప్రభుత్వం ఇలా చేస్తుందని అనుకోలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డీఏ బకాయిలను విడుదల చేయండి : ఉద్యోగ సంఘాలు

కొత్త పీఆర్సీని నియ‌‌మించినందుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ట్రెసా, టీఎన్​జీవో, టీజీఓ నాయకులు సీఎం కేసీఆర్‌‌‌‌కు ధ‌‌న్యవాదాలు తెలిపారు. పెండింగ్‌‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలోని అందరు ఉద్యోగులు సంతృప్తి పడేలా ఫిట్ మెంట్ ఉండాలని సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

9 ఏండ్లలో రెండు పీఆర్సీలు ఇచ్చినం : హరీశ్​రావు

ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పే రివిజన్ కమిటీని ఏర్పాటు చేయడం, 5 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామమని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌‌‌‌కు ట్విట్టర్ (ఎక్స్)​లో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 9 ఏండ్లలో రెండు పీఆర్సీలు ఇవ్వడంతో పాటు, శాసనసభలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మూడో పీఆర్సీని నియమించి, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు.