ధరణి ట్రబుల్స్.. ఉన్నవి చాలక కొత్తగా మరెన్నో సమస్యలు

ధరణి ట్రబుల్స్.. ఉన్నవి చాలక కొత్తగా మరెన్నో సమస్యలు
  • వెబ్​సైట్​లో కరెక్షన్స్​కు నో చాన్స్
  • ‘అదర్ ల్యాండ్ మ్యాటర్’ ఆప్షన్​ గాయబ్
  • టోల్ ఫ్రీ నంబర్​కు టెక్నికల్ ప్రాబ్లమ్స్
  • ల్యాండ్ ఇష్యూస్​తో వెళ్లిన వాళ్లకు చుక్కలే
  • తహసీల్దార్ల ఆఫీసులు, మీసేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న జనం
  • సమస్యలు పరిష్కారం అయితలే..రాష్ట్ర సర్కారు పట్టించుకుంటలే

నెట్​వర్క్/మెట్​పల్లి, వెలుగు: వ్యవసాయ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం అంటూ సర్కారు తెచ్చిన ‘ధరణి’ కొత్త చిక్కులు తెస్తోంది. పాత సమస్యలు పరిష్కారం కాకపోగా, కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. అన్నీ కరెక్ట్​గా ఉన్న వాళ్లకు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు తప్ప.. ఇతర భూ సమస్యలేవీ పరిష్కారం కావడం లేదు. పట్టాదారు పాస్​బుక్కుల్లో ల్యాండ్​ఏరియా తగ్గినా, సర్వే నంబర్‌, పట్టాదారు పేర్లు తప్పుగా పడినా, ఆన్​లైన్ రికార్డుల్లో తప్పులు ఉన్నా.. మార్చుకునేందుకు అవకాశం ఉండటం లేదు. తహసీల్దార్ ఆఫీసుకు వెళ్తే.. మీ సేవ కేంద్రాల్లో ధరణి పోర్టల్ ద్వారా రెక్వెస్ట్ పెట్టుకోవాలని చెబుతున్నారు. మీ సేవ సెంటర్​కు వెళ్తే ధరణిలో ‘అదర్ ల్యాండ్ మ్యాటర్’​ ఆప్షన్ తొలగించారని అంటున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల పెండింగ్ మ్యుటేషన్లను క్లియర్ చేయలేదు. అసైన్​ల్యాండ్స్​కు సంబంధించి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు పౌతీ కూడా కావట్లేదు. రోడ్లు, కాలువలు, ఇతర అవసరాల కింద ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నంబర్లు ధరణిలో కనిపించట్లేదు. ఇలా లక్షలాది మంది రైతులు తహసీల్దార్ ఆఫీసులు, మీ సేవ సెంటర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు..

సర్కారు పట్టించుకోవడం లేదు. మొదటి నుంచీ ఇంతే..

భవిష్యత్​లో అగ్రికల్చర్ ల్యాండ్ ఇష్యూస్ అనేవే లేకుండా అన్ని రికార్డులను ఆన్​లైన్ చేస్తున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎంతో కసరత్తు చేసిన తర్వాత నవంబర్​2న ధరణి పోర్టల్​ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్స్​ను తహసీల్దార్లే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం చెప్పినట్లు ధరణి ద్వారా పాత సమస్యలు పరిష్కారం కావడం లేదు. పైగా కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెండింగ్ మ్యుటేషన్లే ఇందుకు నిదర్శనం. పాత రెవెన్యూ చట్టం ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్స్​ను మొదట సబ్​రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించాక.. తహసీల్దార్​కు అప్లై చేస్తే మ్యుటేషన్ చేసేవారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చే నాటికి రాష్ట్రంలో సుమారు 2 లక్షల మ్యుటేషన్లు తహసీల్దార్ల వద్ద పెండింగ్​లో ఉన్నాయి. ఈ పెండింగ్ అప్లికేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ధరణిని ప్రారంభించారు. అందులోనూ పాత యజమానుల పేర్లే కనిపించాయి. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ 2 లక్షల మందిలో ఏ ఒక్కరికీ మ్యుటేషన్​ చేసిన పాపానపోలేదు.

పౌతీ కూడా కావట్లే

ధరణిలో అసైన్ ​ల్యాండ్స్‌ ఆప్షన్​లేదు. దీంతో ఆయా భూములు కుటుంబ సభ్యుల మధ్య పౌతీ (విరాసత్) కావట్లేదు. తల్లిదండ్రులు చనిపోతే పిల్లల పేర్ల మీదకు, భర్త చనిపోతే భార్య పేరుకు మార్చుకునే అవకాశం లేక 6 నెలలుగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ధరణి రాకముందు కూడా వేల మంది పౌతీ కోసం అప్లై చేసుకున్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే  400 అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. తర్వాత ధరణి లో ఆప్షన్ లేక ఈ ఒక్క జిల్లాలోనే 2 వేల మంది పౌతీ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

ప్రభుత్వం సేకరించిన..భూముల సర్వే నంబర్లు కనిపించట్లే

ప్రైవేట్ పట్టాదారుల నుంచి రోడ్లు, కాలువలు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నంబర్లు కూడా ఆన్ లైన్​లో కనిపించడం లేదు. ఉదాహరణకు ఒక రైతుకు ఉన్న రెండెకరాల భూమిలో పది గుంటల భూమిని ప్రభుత్వం తీసుకుంటే మిగిలిన ఎకరం 30 గుంటల భూమి ధరణిలో కనిపించడం లేదు. అదే సర్వే నంబర్​లోని మిగిలిన రైతుల భూములదీ ఇదే పరిస్థితి. దీంతో వీరంతా రైతుబంధు, రైతుబీమాకు దూరమవుతున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూముల వివరాలు కూడా చాలావరకు ధరణిలో నమోదు చేయలేదు. దీంతో వీటిని ప్రైవేటు వ్యక్తులు పట్టా చేసుకునే ప్రమాదముందని ఆఫీసర్లు అంటున్నారు.

స్లాట్ క్యాన్సిల్ కావట్లే

ధరణిలో స్లాట్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ లేదు. ఏదైనా కారణం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోలేకున్నా.. భూమి అమ్మే వారిలో, కొనే వారిలో ఎవరైనా రిజిస్ట్రేషన్ వద్దు అని చివరి నిమిషంలో స్లాట్ క్యాన్సల్ చేసుకోవాలని వెళ్తే కావట్లేదు. స్లాట్ బుకింట్ టైంలో కట్టిన అమౌంట్​ కూడా వెనక్కి ఇవ్వట్లేదు. దీంతో పబ్లిక్​ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే దిక్కులేదు.

పది రోజుల్లో లక్ష అప్లికేషన్లు.. అంతలోనే ఆప్షన్ గాయబ్

పాస్​బుక్, ఆన్​లైన్ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు ధరణిలో చాన్స్ లేక కిందటేడాది నవంబర్ నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జనవరి 29న ధరణిలో అదర్ ల్యాండ్ మ్యాటర్ ఆప్షన్​ను ఏర్పాటు చేశారు. అప్పటికే ఈ ఆప్షన్ కోసం వేచి చూస్తున్న వేలాది మంది రైతులు మీ సేవ సెంటర్లకు క్యూకట్టారు. కరెక్షన్ల కోసం పది రోజుల వ్యవధిలో లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. కానీ అంతలోనే టెక్నికల్ సమస్యల పేరుతో ఫిబ్రవరి 9న అదర్ ల్యాండ్ మ్యాటర్ ఆప్షన్​ను పూర్తిగా తొలగించారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అప్లై చేసుకున్న లక్షమంది రైతుల పరిస్థితి ఏంటో తెలియదు. వారి రెక్వెస్ట్​ డేటా ధరణిలో ఉంటుందా? పోతుందా? మళ్లీ అప్లై చేసుకోవాల్సి వస్తుందా? అనే విషయంలో ఆఫీసర్లకు కూడా స్పష్టత లేదు.

ఏదో ఆప్షన్‌ రావాలంటున్నరు

మా అమ్మ చీమలపాటి పుల్లమ్మ పేరు మీద రఘునాథపల్లిలో హైదరాబాద్–హన్మకొండ నేషనల్ హైవే పక్కన 281 సర్వే నంబర్ లో 2.26 ఎకరాల భూమి ఉండేది. రోడ్డు వెడల్పులో 0.18 గుంటల భూమి పోయింది. గతంలో మా అమ్మ పేరు మీద పట్టా పాస్ బుక్ ఉంది. రైతుబంధు పైసలు కూడా వచ్చినయ్. నాలుగు నెలల క్రితం అమ్మ చనిపోయింది. భూమిని నా పేరు మీదికి చేయించుకుందామని మీ సేవకు వెళ్తే వీలు కాదంటున్నరు. ధరణి వెబ్​సైట్ లో పుల్లమ్మ పేరు మీద ల్యాండ్ లేదంటున్నరు.ఏదో ఆప్షన్ రావాలె అంటున్నరు.

– చీమలపాటి రవీందర్

జీ.రఘునాథపల్లి, జనగామ జిల్లా

గైడ్​లైన్స్​ వస్తేనే అప్లికేషన్లు తీసుకుంటం

ధరణి పోర్టల్ లో ‘అదర్ ల్యాండ్ మ్యాటర్’ ఆప్షన్ తొలగించారు. దీనిపై తహసీల్దార్​ఆఫీసుకు వచ్చి ఆరా తీస్తున్నారు. ఇది ఎప్పుడు ఓకే అవుతుందో చెప్పలేం. సర్కారు నుంచి గైడ్​లైన్స్ వచ్చాకే తిరిగి అప్లికేషన్లు తీసుకుంటం.

– నీరటి రాజేశ్, తహసీల్దార్, మెట్ పల్లి