- ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డీఈడీ, డీపీఎస్‌ఈ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై క్లాసులకు వెళ్లకుండా, కేవలం పరీక్షలు రాస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. విద్యార్థుల ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌ను పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియతో పాటు, పరీక్ష రాయడానికి కావాల్సిన అర్హతతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఫేషియల్ అటెండెన్స్ ఉంటేనే ఎంట్రీ
సర్కారు కాలేజీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు డీఈడీ, డీపీఎస్‌ఈ కాలేజీల్లో ప్రస్తుతం ఫేషియల్ అటెండెన్స్ విధానం అమల్లో ఉంది. అయితే, చాలామంది విద్యార్థులు క్లాసులకు సరిగ్గా హాజరు కావడం లేదని గుర్తించిన సర్కార్.. అటెండెన్స్‌ను పరీక్షలతో లింక్ చేయాలని నిర్ణయించింది. 2026-–27 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఎఫ్‌ఆర్‌ఎస్ డేటా ప్రకారం ఎవరికైతే సరైన హాజరు శాతం ఉంటుందో, వారినే పరీక్ష ఫీజు కట్టేందుకు అనుమతిస్తారు. హాజరు తక్కువగా ఉంటే పరీక్ష రాసే చాన్స్ ఉండదు. దీన్ని కఠినంగా అమలు చేయాలని డీఈఓలు, ఆర్జేడీలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలిచ్చారు. కాగా, ఇక నుంచి విద్యార్థులు ప్రతిరోజూ కాలేజీకి వెళ్లి ఫేషియల్ అటెండెన్స్ వేయించుకోవడం తప్పనిసరి కానుంది.
