ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్‌‌ ప్రాక్టీస్ చేయకుండా కొత్త రూల్స్

ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్‌‌ ప్రాక్టీస్ చేయకుండా కొత్త రూల్స్

యాదాద్రి, వెలుగు: రాష్ట్రంలోని పీహెచ్‌‌సీల్లో నాణ్యమైన వైద్యం అందించడానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయని, అయినా జనం రావడం లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలో 20 వేల నుంచి 30 వేల జనాభా ఉన్న పీహెచ్‌‌సీకి 30 నుంచి 40 మంది మాత్రమే వస్తున్నారని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు డాక్టర్లు డ్యూటీలో ఉండి, ప్రజల నమ్మకం పెంచుకోవాలని, తద్వారా ఓపీ సేవలను మెరుగుపర్చాలని సూచించారు. మంగళవారం యాదాద్రి జిల్లాలో ఆయన పర్యటించారు. యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు మండలం శారాజీపేట పీహెచ్‌‌సీలను సందర్శించారు. మెడికల్‌‌ రికార్డులను​ పరిశీలించారు. పీహెచ్‌‌సీలకు ప్రజలు ఎందుకు రావడం లేదని డాక్టర్లను ప్రశ్నించారు. అన్ని పీహెచ్‌‌సీల్లో డెలివరీలు పెంచాలని ఆదేశించారు. ఆలేరు మండలం శారాజీపేటలోని పీహెచ్‌‌సీలో డెలివరీలు ఎందుకు చేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. తర్వాత యాదాద్రి కలెక్టరేట్‌‌కు వెళ్లిన ఆయన.. కలెక్టర్‌‌‌‌ పమేలా సత్పతి, అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ప్రైవేట్‌‌ ప్రాక్టీస్ చేయకుండా చర్యలు..
ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్‌‌ ప్రాక్టీస్ చేయకుండా నిబంధనలు తేనున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు. దేశంలోనే తెలంగాణలో ఎక్కువగా సీజేరియన్లు జరుగుతున్నాయని, తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు నెలల్లో డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా నాలుగో వేవ్ రాదన్నారు