రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోందని టీమ్ చెప్పింది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో పాటు ఈ ఏడాది దక్షిణ భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని అన్నారు. ఆదివారం నిర్వహించిన సక్సెస్ ప్రెస్ మీట్ దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ 'ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ పట్ల చాలా సంతోషంగా ఉంది. బుధవారం నుంచి కొత్త సీన్లు యాడ్ చేస్తున్నాం. హీరోయిన్ జాన్వీ కపూర్కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబు గారికి ఒక సీన్ ఉంటుంది. మిస్ అయిన అంశాలన్నీ అందులో ఉంటాయి. ఆ సీన్స్ చూసిన తర్వాత జాన్వీ పాత్రకు ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. 95 శాతం మంది ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్, కథ గొప్పతనం, రామ్ చరణ్ గారి నటనను ప్రశంసించారు.
ఇలాంటి కథలు మరిన్ని రావాలని కోరుకున్నారు. మేము నమ్మిన దానిని ప్రేక్షకులు నిజం చేశారు' అని చెప్పాడు. నిర్మాత సతీష్ కిలారు మాట్లాడుతూ 'ప్రేక్షకులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను ఇప్పటికే తగ్గించాం. ఆదివారం నుంచే అన్ని ప్రాంతాల్లో టికెట్ రేట్లు తగ్గించాం. అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది' అని అన్నారు. ఈ తరం ప్రేక్షకులకు అవసరమైన సినిమా ఇదని మైత్రీ శశి అన్నారు. ఈ విజయంలో భాగం కావడం సంతోషంగా ఉందని లిరిసిస్ట్ అనంతశ్రీరామ్ చెప్పాడు.
