బస్వాయిపల్లిలో కొత్తరాతి యుగపు ఆనవాళ్లు

బస్వాయిపల్లిలో కొత్తరాతి యుగపు ఆనవాళ్లు

హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లి శివారులో ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. క్రీస్తుపూర్వం 4000 –2000 సంవత్సరాలకు చెందిన కొత్త రాతి యుగపు ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. వైటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన కొలనుపాక సోమేశ్వర, ప్రతాపరుద్ర ఆలయాల పరిరక్షణ పనులకు కావాల్సిన కొత్త గ్రానైట్ రాతి కోసం చేస్తున్న అన్వేషణలో భాగంగా, బస్వాయిపల్లి వేణుగోపాలస్వామి ఆలయ సమీపంలోని బండపై కొత్త రాతియుగపు మానవులు రాతి గొడ్డళ్లను పదును పెట్టడానికి అరగదీసిన గుంటలను గుర్తించామని ఆయన చెప్పారు. సమీపంలోని చౌదరపల్లి, తాటికొండ, రాచాల, మూసాపేటల్లో ఇలాంటి గుంటలున్నాయని, ఈ ప్రాంతం కొత్త రాతియుగంలో ఆదిమానవుల నివాస స్థావరంగా ఉండేదని, వారు కొండలు, కొండ చరియలు, పాముపడిగె ఆకారపు రాళ్ల కింద నివసించేవారని తెలిపారు. ఆయన వెంట గ్రామానికి చెందిన వడ్డె మొగిలయ్య ఉన్నారు.