మామిడిలో కొత్త టెక్నాలజీ

మామిడిలో కొత్త టెక్నాలజీ
  • ఇజ్రాయెల్ ​ఆల్ట్రా హైడెన్సిటీ టెక్నాలజీ తెచ్చిన ఉద్యాన శాఖ
  • సిద్దిపేట జిల్లా ములుగులో లక్ష మొక్కలతో పైలెట్​ ప్రాజెక్ట్
  • రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో సాగుకు అనుకూలం

హైదరాబాద్, వెలుగు: మామిడి మొక్కలు పెట్టి ఐదేండ్ల పాటు ఆగాల్సిన పనిలేదిక.. నాటిన ఏడాది నుంచే పూత, కాత వచ్చే ఆల్ట్రా హైడెన్సిటీ టెక్నాలజీని తెలంగాణ హార్టికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందుబాటులోకి తెచ్చింది. ఇజ్రాయెల్‌‌‌‌కు చెందిన ఈ టెక్నాలజీని సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఎక్సలెన్స్ (సీవోఈ)లో డెవలప్ ​చేసింది. సాధారణ మామిడితో హెక్టారుకు 6 టన్నుల దిగుబడి వస్తే కొత్త విధానంలో 12–15 టన్నుల దాకా రానుం దని హార్టికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు.  ప్రస్తుతం పైలెట్ ​ప్రాజెక్ట్​ కింద లక్ష మొక్కల వరకు సిద్ధం చేసిన ఉద్యానశాఖ.. ఆసక్తి గల రైతులకు ఆల్ట్రా హైడెన్సిటీ టెక్నాలజీ సాగుపై అవగాహన కల్పించడమే గాకుండా.. తక్కువ ధరకే మొక్కలు అందజేయనుంది. ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ అయిన ఆల్ట్రా హైడెన్సిటీ విధానంలో మామిడి మొక్కల నర్సరీల్లోనే రెండేండ్లపాటు పెంచుతారు. ఎక్కువ ఎత్తుకు పెరగకుండా కొమ్మలను కత్తిరిస్తారు. విశాల ఆకారం వచ్చేలా ఏడాదికి3 సార్లు కొమ్మలు కట్‌‌‌‌‌‌‌‌చేస్తారు. ఇలా రెండేండ్ల వయసు మొక్కకే పెద్దవి, చిన్నవి కలిపి దాదాపు 81 కొమ్మలు ఉంటాయి. శాస్త్రీయంగా ఎరువులతో ఫర్టీగేషన్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసి నర్సరీ స్థాయిలోనే మామిడి మొక్క సిద్ధమవుతుంది.  ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది అడుగులకు మించకుండా రైతు మొక్కను నాటుకోవాల్సి ఉంటుంది. నాటిన ఏడాది నుంచే పూత, కాత మొదలవుతుంది. ఒక్కో చెట్టుకు 25 నుంచి 30 కాయలు వస్తాయి. చెట్ల మధ్య దూరం తక్కువ ఉండటం ద్వారా ఎక్కువ దిగుబడికి ఆస్కారం ఉంటుంది. చెట్టు ఎత్తు తక్కువ ఉండటంతో కాయలు తెంపడానికి, మందులు పిచికారి చేయడానికి ఈజీగా ఉంటుంది. సాధారణ మామిడి మొక్కలు ఎకరానికి గరిష్టంగా 200 నాటితే.. కొత్త విధానంలో 674 వరకు నాటుతారు. 

ఫైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌
సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్ శాస్త్రీయ పద్ధతిలో ఆల్ట్రా హైడెన్సిటీ విధానంలో లక్ష మామిడి మొక్కలను డెవలప్​ చేసింది. సీవోఈలో మామిడి రైతులకు హెడెన్సిటీ విధానంపై ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వనుంది. శిక్షణ కోసం రైతులు సీవోఈ ఇన్​చార్జ్‌‌‌‌‌‌‌‌లను సంప్రదించాల్సి ఉంటుంది. రైతులు వారి భూమి నుంచి అరకిలో మట్టి నమూనా, పంటలకు పెట్టే అర లీటరు నీటిని తీసుకొని వెళ్తే వస్తే ఉచితంగా టెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేసి రైతులకు సూచనలు ఇస్తారు. 

సాధారణ పద్ధతి కంటే మేలు
సాధారణ పద్ధతుల్లో మామిడి సాగు చేస్తే పెద్ద మొత్తంలో పంట దిగుబడి రావడానికి ఎనిమిదేండ్లు పడుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ 25 ఏండ్లు పైబడినవే. ఇంకా ఎక్కువ కాలం కాత వచ్చే అవకాశం లేదు. వీటిని తీసేయాల్సి ఉంటుంది. కానీ కొత్త టెక్నాలజీతో వేసే బంగనపల్లి, హిమాయత్‌‌‌‌‌‌‌‌, కేసర్‌‌‌‌‌‌‌‌, దషేరీ, ఆల్ఫాన్సో వంటి మేలు రకాలను వేగంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో10 లక్షల ఎకరాల్లో ఇలాంటి మామిడి తోటలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందని హార్టికల్చర్​నిపుణులు చెబుతున్నారు. సాధారణ పద్ధతిలో మన దేశంలో హెక్టార్‌‌‌‌‌‌‌‌కు కేవలం 6 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుండగా.. ఆల్ట్రా హైడెన్సిటీ టెక్నాలజీతో ఆస్త్రేలియాలో హెక్టార్‌‌‌‌‌‌‌‌కు 70 టన్నులకు పైగా మామిడి దిగుబడి వస్తోంది. ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ హెక్టార్‌‌‌‌‌‌‌‌కు 40 టన్నులు దిగుబడి సాధిస్తోంది. ములుగులోని సీవోఈలో 11 ఎకరాల్లో, జనగామ, మెదక్‌‌‌‌‌‌‌‌, చేవెళ్లలో కొత్త టెక్నాలజీతో మామిడి సాగు మొదలైంది. 

ఎకరానికి ఖర్చు 2.60 లక్షలు
నర్సరీలో శాస్త్రీయంగా రెండున్నర ఏండ్ల పాటు పెంచిన మొక్కలు కనీసం 300 నాటుకున్నా ఒక్కో దానికి రూ.200 చొప్పున రూ.60 వేలు అవుతుంది. నాటుకోవడానికి గుంతలు తవ్వడానికి, డ్రిప్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు, అంతర సేద్యంతో పాటు ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ కోసం ఎకరానికి 50 మొక్కల చొప్పున  శ్రీగంధం చెట్ల, టేకు చెట్లు, ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌కు మొదటి ఏడాది మెయింటెన్స్‌‌‌‌‌‌‌‌ అంతా కలిపి రూ.2.60 లక్షల ఖర్చు అవుతుంది. చెట్టుకు 20 కేజీల చొప్పున 300 చెట్లకు6 టన్నుల దిగుబడి వస్తే.. కనీస ధర రూ.30 వేసుకున్నా.. ఏడాది తిరగ ముందే  ఎకరానికి రూ.1.80 లక్షల ఆదాయం వస్తుందని హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌ శాఖ చెబుతోంది. 

రాష్ట్రంలో సాగు చేయొచ్చు..
రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పంట వేసుకునేందుకు అవకాశం ఉంది. అధిక దిగుబడులు వచ్చే ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌ తరహా ఆల్ట్రా హైడెన్సిటీ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నం. ఇప్పటికే రెండున్నర ఏండ్ల పాటు ఈ టెక్నాలజీతో లక్ష మొక్కలను సిద్ధం చేశాం. రైతులకు ఉచిత శిక్షణ ఇస్తాం. మామిడి సాగుకు నాబార్డు లోను కూడా ఇస్తోంది. 
- వెంకట్రామ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కమిషనర్‌‌‌‌‌‌‌‌, హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌