Chit Chat : నాగం జనార్దన్ రెడ్డికి కొత్త టెన్షన్లు

Chit Chat : నాగం జనార్దన్ రెడ్డికి కొత్త టెన్షన్లు

తెలంగాణ వచ్చినా ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కలేదన్నది చాలామందిలో ఉన్న ఫీలింగ్. గౌరవాల సంగతి ఎట్లా ఉన్నా ఓ సీనియర్ ఉద్యమకారుడు మాత్రం నా రాష్ట్రంలో నేను సభలో లేకపోవడం ఏంటని బాగా ఫీలవుతున్నారట. ఎన్ని బాధలున్నా, బ్రహ్మాండం బద్దలైనా సరే ఈసారి వెళ్లి తీరాలని పట్టుబడుతున్నారు. అయినా ఆయనకు కొత్త టెన్షన్లు తప్పట్లేదంటున్నారు.

ఒకప్పుడు రాష్ట్రంలో హల్చల్ చేసిన మోస్ట్ సీనియర్ లీడర్ నాగం జనార్దన్ రెడ్డికి ఇంకా కష్టాలు తీరలేదంటున్నారు ఆయన అనుచరులు. సొంత బాధలు, హెల్త్ సమస్యలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఈ సమస్యలనే సాకుగా చూపించి రాజకీయంగానూ ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. ఆయన సెగ్మెంట్లో మరొకరికి టికెట్ ఇస్తారన్న ప్రచారమే ఆయన వర్గంలో కలకలానికి కారణం. 

ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆయన కొడుక్కి నాగర్ కర్నూల్ టికెట్ అడుగుతున్నారనీ, బీఆర్ఎస్ లో చాన్స్ లేదనే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనే నాగం వర్గం మండిపడుతోంది. కేసీఆర్ ను పొగుడుతూ, లోకల్ బీఆర్ఎస్ లీడర్లనే దామోదర్ రెడ్డి తప్పుబడుతున్నారనీ, ఆయన్ను నమ్మొద్దని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ పైనే నాగం పోరాడుతున్నారని గుర్తుచేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా లోకల్ బాడీల్లో పార్టీని గెలిపించామనీ, రాహుల్ యాత్రలో సభను సక్సెస్ చేశామని నాగం వర్గం ప్రచారం చేస్తోంది. 

నాగం ఇంత పట్టుదలగా ఉండడానికి కారణాలున్నాయంటున్నారు ఆయన అనుచరులు. ఉమ్మడి రాస్ట్రంలో మంత్రిగా వెలుగు వెలిగిన ఆయన వైఎస్ హయాంలో ప్రతిపక్ష నేతగా బలంగా పనిచేశారు. ఓబుళాపురం మైనింగ్ సహా పలు అంశాలపై విరుచుకుపడేవారు. ఉద్యమం కాలంలో తెలంగాణపై సొంత పార్టీ వైఖరినే ప్రశ్నిస్తూ టీడీపీ నుంచి సస్పెండయ్యారు. 2014లో తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఆయన చట్టసభలో అడుగుపెట్టలేకపోయారు. అయినా పబ్లిక్ సమస్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలపై ఒంటరి పోరాటమే చేస్తున్నారు. చాలామంది నేతలు విమర్శలతో సరిపెట్టినా, నాగం ఒక్కరే లోతుగా స్టడీ చేసి మాట్లాడడంతో పాటు కోర్టుల్లోనూ ఫైట్ చేస్తున్నారు. ఆయనకు ఈసారి ఎట్లాగయినా సభలో అడుగుపెట్టాలన్న ఆశ బలంగా ఉందని చెబుతున్నారు. 1969 తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలోనూ ముందున్న తాను స్వరాష్ట్రంలోనే అసెంబ్లీలో లేకపోవడం పెద్ద లోటుగా ఫీలవుతున్నారట.

ఇప్పుడు 70ల్లో ఉన్న నాగం ఈసారే చివరి అవకాశంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. కచ్చితంగా తనకే చాన్స్ కావాలని పార్టీలో పట్టుబడుతున్నారట. డైరెక్ట్ ఎలక్షన్స్ లోనే ఉంటాననీ, వేరే ఆఫర్లు వద్దని కూడా ముందే తెగేసి చెబుతున్నారట. నాగం పరిస్థితి తెలిసిన లోకల్ కాంగ్రెస్ వర్గాల్లో ఆయనకే సింపథి ఉందంటున్నారు.