- తోమాల, తులాభారం సేవలను అందుబాటులోకి తెచ్చిన దేవస్థానం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినమైన మంగళవారం నుండి ఆలయంలో రెండు నూతన సేవలను ఆలయ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. నూతన సేవలైన తోమాల సేవ, తులాభారం సేవను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తోమాల సేవ ద్వారా స్వామివారికి పుష్పాలంకరణ విశేషంగా నిర్వహించనున్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలో తోమాల సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ఈవో వెంకటరావు తెలిపారు. మంగళవారం తొలిసారిగా ఆరంభించిన తులాభారం సేవకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చిందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం ద్వారా మంగళవారం ఆలయానికి రూ.35,380 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈవో వెంకటరావు మాట్లాడుతూ.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక భావన పెంపొందించడం కోసం కొత్తగా తోమాల సేవ, తులాభారం సేవను అందుబాటులోకి తెచ్చామని, ఇది ఆలయ చరిత్రలో ముఖ్య ఘట్టంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఏఈవో రఘు, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు తదితరులు ఉన్నారు.
