లంకపై కివీస్ విజయం...సెమీస్ బెర్తు ఖాయం

లంకపై కివీస్ విజయం...సెమీస్ బెర్తు ఖాయం

టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అపజయమన్నదే లేకుండా దూసుకెళ్తోంది. తాజాగా సూపర్ 12లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లోనూ విజయం సాధించింది. లంకేయులపై ఏకంగా 65 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్...సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. 

ఫిలిప్స్ సెంచరీ...
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన  న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్ నాలుగో బంతికే ఫిన్ అలెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ వరుసగా పెవీలియన్ చేరారు. దీంతో  న్యూజిలాండ్ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నారు.  నాల్గో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ముఖ్యంగా ఫిలిప్స్ చెలరేగాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింతగా రెచ్చిపోయాడు. అయితే హసరంగా డారిల్ మిచెల్ ఔటయ్యాడు. అనంతరం  క్రీజులోకి వచ్చిన జేమ్స్ నీషమ్‌ త్వరగానే పెవీలియన్ చేరాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా..గ్లేన్ ఫిలిప్స్ ధాటిగా ఆడుతూ 61 బంతుల్లో సెంచరీ చేశాడు. లంక బౌలర్లలో కాసున్ రజిత 2 వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ, ధనంజయ డిసిల్వా, వానిందు హసరంగా, లాహిరు కుమారా తలో వికెట్ పడగొట్టారు. 

బుల్లెట్ బౌల్ట్..


168 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక...కివీస్ బౌలర్ల ధాటికి..కేవలం 19.2 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్ది క్షణాలకే లంకను సౌతీ దెబ్బతీశాడు. ఓపెనర్ నిస్సంకను ఔట్ చేశాడు. ఆ తర్వాత మరోబౌలర్ బౌల్ట్ లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. మెండీస్, డిసిల్వ, అసలంకలను పెవీలియన్ చేర్చాడు. దీంతో  శ్రీలంక 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే చమిక కరుణరత్నే కూడా ఔటయ్యాడు. ఈ సమయంలో భానుక రాజపక్స, దాసున్ శనక కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే భానుక రాజపక్సను ఫెర్గ్యూసన్ను బుట్టలో వేసుకోవడంతో...లంక కోలుకోలేకపోయింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి..చివరకు 102 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు తీయగా...సాంట్నర్, సోది చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఫెర్గ్యూసన్, సౌథీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు..