- యాదగిరిగుట్ట సమీపంలో ఘటన
- రైలులో దంపతులు గొడవ పడుతున్న వీడియోలు వైరల్..
- మృతులది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా
యాదగిరిగుట్ట, వెలుగు: వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకి నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో శివారులో ఇది చోటుచేసుకుంది. అయితే ట్రైన్ లో ఈ దంపతులు గొడవ పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25)కు, విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం అంకవరం గ్రామానికి చెందిన కొంగరపు భవాని(19)తో ఈ ఏడాది అక్టోబర్ 24న పెళ్లి జరిగింది. సింహాచలం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. నవదంపతులు ఇద్దరూ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్నారు.
గురువారం రాత్రి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు వీరిద్దరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మచిలీపట్నం ట్రైన్ లో బయలుదేరారు. ట్రైన్ యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి దగ్గరకు చేరుకున్న సమయంలో ముందుగా భార్య ఆ తర్వత భర్త రైల్లోంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విధుల్లో ఉన్న రైల్వే ట్రాక్ మెన్ ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
సోషల్మీడియాలో దంపతుల గొడవ వీడియోలు..
వంగపల్లిలో ట్రైన్ నుండి దంపతులు దూకి చనిపోయిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత శుక్రవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే ట్రైన్ లో ఈ దంపతులు గొడవ పడుతున్న వీడియోలు శనివారం మధ్యాహ్నం తర్వాత సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి.
ఈ నేపథ్యంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక గొడవపడుతూ ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి జారిపడి చనిపోయారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దంపతుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారని, ఘటనపై బాధిత కుటుంబాల సభ్యులు ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు.
