
- మహిళా గ్రూప్‌ల మాదిరిగా సంఘాల ఏర్పాటుకు నిర్ణయం
- సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులను కోటికి చేర్చడమే టార్గెట్
- దివ్యాంగ సంఘాల్లో పురుషులకూ చాన్స్
- అవసరమైన వారికి బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చేలా నిర్ణయం
- నెలాఖరు లోగా సంఘాల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా 60 ఏండ్లు నిండిన మహిళలు, దివ్యాంగులతో పాటు 15 నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న బాలికలతో సైతం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.70 లక్షలకుపైగా మహిళా సంఘాలు ఉండగా వాటిలో సుమారు 67 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల సంఖ్యను 10 లక్షలకు పెంచడంతో పాటు సభ్యుల సంఖ్యను కోటి చేయాలన్న దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం సంఘాల బయట ఉన్న 60 ఏండ్లు పైబడిన వృద్ధ మహిళలతో ఎల్డర్లీ మహిళా స్వయం సహాయక సంఘాలు, దివ్యాంగులతో దివ్యాంగ ఎస్‌హెచ్‌జీలు, 15 నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న బాలికలతో కిశోర బాలికల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 11 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ ప్రకటించారు.
బాలికలకు పొదుపు పాఠాలు
15 నుంచి 18 ఏండ్లు ఉన్న బాలికలతో కిశోర బాలికల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి వారికి పైసలు పొదుపు చేయడంతో పాటు బ్యాంకింగ్ లాదేవీలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, బాలికలు, మహిళలపై జరిగే అత్యాచారాలతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ సంఘాల్లో బాలికలను చేర్పించడం కోసం సెర్ప్ ఆఫీసర్లు, సిబ్బంది స్కూళ్లు, కాలేజీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.
దివ్యాంగ సంఘాల్లో పురుషులు సైతం...
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.30 లక్షల మంది దివ్యాంగులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దివ్యాంగులందరినీ స్వయం సహాయక సంఘాల పరిధిలోకి తీసుకురాబోతున్నారు. వీరితో కూడా బ్యాంక్ అకౌంట్లు తెరిపించడం, పొదుపు అలవాటు చేయడంతో పాటు వారికి సంఘాల ద్వారా ప్రభుత్వ పథకాలు అందేలా చూడనున్నారు. అలాగే దివ్యాంగులకు అవసరమైన వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలను సైతం ఈ సంఘాల ద్వారా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ సంఘాల్లోని దివ్యాంగులకు మహిళా సంఘాలకు ఇచ్చినట్లే వ్యాపారాల కోసం బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘంలో 7 నుంచి 10 మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టబోతున్నారు.
60 ఏండ్లు దాటిన వారికి మళ్లీ చాన్స్
ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన మహిళలను స్వయం సహాయక సంఘాల నుంచి తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 60 ఏండ్లు దాటిన మహిళలతో మళ్లీ కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఏ ఆసరా లేని వృద్ధ మహిళలు ఉంటే వారు చిరువ్యాపారాలు చేసుకునేందుకు సాయం చేయడం, కొడుకులు సరిగా చూసుకోకపోతే ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంలో సాయం చేయడం, వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నామని ఫీల్ కాకుండా నలుగురితో సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.